
తాజా వార్తలు
నడిరోడ్డుపై నరకయాతన
సరిహద్దుల్లో అడ్డుకున్న ఏపీ పోలీసులు
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్‌లో చిక్కుకు పోయినవారిని సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు అనుమతించడంతో నిన్న బయల్దేరారు. ఎక్కడికక్కడ సరిహద్దుల్లో వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్ పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నప్పటికీ ఏపీలోకి పోలీసులు అనుమతించడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో వసతి గృహ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయాలని చెప్పడంతో వారంతా పోలీసు ఠాణాల వద్ద బారులు తీరారు. అనుమతి ఇస్తే ఇళ్లకు వెళ్లిపోతామని చెప్పడంతో పోలీసులు దాదాపుగా 8వేల మందికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. దీంతో వారందరూ స్వస్థలాలకు బయలుదేరారు. సొంత వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రయాణమయ్యారు. వీరిలో ఎక్కువమంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థులున్నారు. వారిని సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులు ఆపేశారు.
నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నవారిని ఎట్టకేలకు ఏపీలోకి అనుమతించారు. బుధవారం అర్ధరాత్రి అందుకు అనుగుణంగా వైద్య పరీక్షల కోసం వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుట్ ఐటీకి, తూర్పుగోదావరి వారిని రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఇక హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా అనుమతించేది లేదని సరిహద్దుల వద్ద ఏపీ అధికారులు స్పష్టం చేశారు.
తెల్లవారుజాముకే బారులుతీరారు..
హైదరాబాద్ నుంచి రాత్రి బయల్దేరిన వారంతా తెల్లవారుజాముకు గరికపాడు చెక్‌పోస్టు, దామరచర్ల తదితర సరిహద్దు ప్రాంతాలకు చేరుకోగానే చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించి స్వగ్రామాలకు పంపించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేసేందుకు సిద్ధమవుతున్నారు. గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు నడిరోడ్డుపైనే వేచిఉన్నారు. చిన్న పిల్లలతో బయల్దేరిన వారు రోడ్డుపైనే కూర్చుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో వైపు హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు విద్యా సంస్థలు, సంస్థల్లో పని చేస్తున్నవారు.. ఎక్కడి వారక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఏవైనా సమస్యలుంటే 1902 నంబరుకు ఫోన్ చేయాలని సూచించింది.
పుల్లూరు టోల్గేట్ వద్ద ధర్నా..
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ధర్నా చేపట్టారు. కర్నూలు వైపు వెళ్లే వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించారు. ఎన్వోసీ పత్రాలు ఉన్నా పోలీసులు అనుమతించడం లేదని మండిపడ్డారు. మరో వైపు నంద్యాల నుంచి వచ్చే విద్యార్థులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాలలో బ్యాంకు కోచింగ్ సెంటర్లలో చదువుతున్న 200 మంది విద్యార్థులు అర్ధరాత్రి నుంచి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకుంటున్నారు.