‘అనారోగ్యంగా ఉంటేనే మాస్క్‌ ధరించండి’
close

తాజా వార్తలు

Published : 01/04/2020 08:32 IST

‘అనారోగ్యంగా ఉంటేనే మాస్క్‌ ధరించండి’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తోన్న సమయంలో బయటికి వెళ్లిన వారు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ అన్నారు. అనారోగ్యంగా ఉంటేనే మాస్క్‌ ధరించాలని, ప్రతిఒక్కరూ ఎన్‌-95 మాస్క్‌ వేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. జ్వరం, దగ్గు లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఇకపై ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేట్‌ వైద్యులు కరోనాపై అవగాహన కల్పిస్తారన్నారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని ఐ అండ్‌ పీఆర్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అపొలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీతారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారంతా 60-65 సంవత్సరాల వయసున్న, గతంలో ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నవారేనని వివరించారు. ఎన్ని వైద్య సదుపాయాలున్నా వైరస్‌ ఒకరి నుంచి మరొకరి చేరకుండా జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉందని స్పష్టం చేశారు. మిగిలిన 15 రోజుల లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటించినప్పుడే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. 10 సంవత్సరాలలోపు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహారం విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. సరైన పద్ధతుల్లో కడిగి, ఉడికించి ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్‌లో 5 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో రోజుకు 1,200 పైచిలుకు నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఉందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని