close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/04/2020 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

పొగ తాగితే.. కరోనా కమ్మేస్తుంది!

పొగరాయుళ్లకు ముప్పు 14రెట్లు ఎక్కువ
మానేస్తే మంచిదంటున్న నిపుణులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. జనమంతా ఇళ్లకే పరిమితమై ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితులు వచ్చాయి. లాక్‌డౌన్‌ పేరుతో ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడికక్కడ అన్నీ మూతపడటంతో పొగరాయుళ్లకు ఊపిరాడటం లేదు. రోజుకు లెక్కలేనన్ని సిగరెట్లు కాల్చే వారికైతే కునుకే కరవైంది. దీంతో రెట్టింపు ఖర్చు పెట్టి మరీ సిగరెట్లు కొనేందుకు బయటికొస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఏర్పడుతోందంటున్నారు వైద్య నిపుణులు. ఇలా పొగతాగే అలవాటున్నవారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) నివేదికలో వెల్లడించింది. సహజంగానే పొగతాగే అలవాటు ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అంందులోనూ కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణం పొగరాయుళ్లకు మరింత గడ్డు కాలమని నిపుణులు చెబుతున్నారు.

మార్చుకునే సమయమిదే..
కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ 21రోజులకు మానసికశాస్త్రంలో, సనాతన ధర్మంలో అర్ధమండలంగా కొన్ని విశేషాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సంకల్పించినపుడు దాన్ని సాధించేందుకు 21రోజులు కఠినంగా సాధన చేస్తే తప్పకుండా అనుకున్నది నెరవేరుతుందంటున్నారు. ఈ సమయంలోనే చెడు అలవాట్లకు పూర్తిగా దూరం కావడానికీ ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇలా పొగాకు తాగడం మానేసిన కొద్దినెలలకే శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నగరంలో కొత్తగా సంచార కేంద్రాలు..
నగరంలో ఎక్కడికక్కడ దుకాణాలు, కొట్లు మూసేయడంతో పొగాకు అలవాటుపడ్డవారు కొత్త దార్లు వెతుక్కుంటున్నారు. ఇదే అదనుగా అక్రమంగా కొందరు ప్రత్యేక వాహనాల్లో హుక్కా బాటిళ్లను తరలిస్తున్నారు. ఇందుకు మత్తుబాబుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇటీవలే నగరంలో సంచార హుక్కాకేంద్రం ఒకటి పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం.

ఎలా వ్యాపిస్తుంది..?
పొగతాగే వారిలో కరోనా వ్యాపించే అవకాశాలు 14రెట్లు ఎక్కువని చెబుతోన్న డబ్ల్యూహెచ్‌వో అందుకు కొన్ని కారణాలను కూడా తెలిపింది.
చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడంతో కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. పొగరాయుళ్లు చేతివేళ్లను ప్రతిసారీ నోటి వద్దకు తీసుకెళుతుంటారు. దీంతో వైరస్‌కు స్వాగతం పలుకుతున్నట్లే.
కొన్నిరకాల ధూమపాన సాధనాల(హుక్కా పైపు)ను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఇలా వైరస్‌ వ్యాపించే అవకాశాలున్నాయి
పొగాకు శ్వాసకోశ వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీంతో వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి.

మానేస్తే జీవితకాలం ఉపయోగం
-డాక్టర్‌ ఎస్‌ మల్లికార్జున్‌రావు, శ్వాసకోశవ్యాధి నిపుణులు
పొగాకు పీల్చేవారిపై కరోనా ప్రభావం ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇన్నాళ్లు పొగ పీల్చడంతో కోల్పోయిన రోగ నిరోధక శక్తిని.. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం, పండ్లతో తిరిగి పొందే ప్రయత్నం చేయాలి. ఈ ఖాళీ సమయంలో ఇతర పనులు చేస్తూ మనసు మళ్లించుకోవడం ఉత్తమం. ఇది ఇప్పటికే కాదు.. జీవితాంతం ఉపయోగపడుతుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.