అన్నదాత బలవన్మరణం
close

తాజా వార్తలు

Updated : 28/04/2020 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నదాత బలవన్మరణం

 భూ ప్రక్షాళనలో జాప్యంతోనేనన్న  కుటుంబీకులు
 ఆర్థిక ఇబ్బందులే కారణమన్న అధికారులు

దోమకొండ : తన తల్లి పేరిట ఉన్న భూమిని రికార్డులో పూర్తిగా నమోదు చేయడం లేదని, బతుకు తెరువుకు ఉన్న ఒక్క ఆధారం దక్కడం లేదనే బెంగతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ముత్యంపేటకు చెందిన రైతు వంగ దేవారెడ్డి(45) తల్లి హంసవ్వ పేరిట 4.08 ఎకరాల భూమి ఉండేది. ఆమెకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొడుకు దేవారెడ్డికి తల్లి పేరిట ఉన్న భూమే ఆధారం. 15 ఏళ్ల కిందట రెండెకరాలు విక్రయించారు. మిగతా 2.08 ఎకరాల్లో పంటలు పండించేవారు. భూప్రక్షాళనలో భాగంగా కొత్తగా డిజిటల్‌ పాసు పుస్తకాలు రాగా, తల్లి హంసవ్వ పేరిట ఆరు గుంటలు మాత్రమే నమోదైంది. రెవెన్యూ అధికారులు మోకా పంచనామా చేపట్టి..   1.01 ఎకరాలు రికార్డులో నమోదు చేశారు. మిగతా    1.07 ఎకరాలు ఇంకా చేర్చాల్సి ఉంది. ఈకారణంగా రైతు బంధు సాయం అందలేదు. కిసాన్‌ సమ్మాన్‌ యోజన మాత్రమే వచ్చింది. దేవారెడ్డి 5 నెలలుగా పాసు పుస్తకంతో పూర్తి భూమి నమోదు చేయించాలని విన్నవిస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన కుమార్తె, బుద్ధిమాంద్యం గల కుమారుడు ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భూమి విక్రయిద్దామంటే రికార్డుల్లో లేకపోవడంతో ఎవరూ కొనని పరిస్థితి. దీంతో మనస్తాపం చెందిన దేవారెడ్డి సోమవారం తెల్లవారుజామున వ్యవసాయబావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. తాము ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భూమి రికార్డులో నమోదు చేయించాలని దేవారెడ్డి రెండు నెలల కిందట రెవెన్యూ సదస్సులో దరఖాస్తు ఇచ్చారని తహసీల్దారు అంజయ్య ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. పూర్తి ఆధారాలుంటే హంసవ్వ పేరిట భూమి నమోదు చేయిస్తామని, మోకా పంచనామా ఆధారంగా న్యాయం చేశామని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే రైతు చనిపోయినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని