ప్రజలు ప్రైవేట్‌కు వెళ్తే తప్పేంటి?:టీఎస్‌ హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 20/05/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజలు ప్రైవేట్‌కు వెళ్తే తప్పేంటి?:టీఎస్‌ హైకోర్టు

హైదరాబాద్‌: ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్‌ కేంద్రాలకు నేరుగా వెళ్లి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందడం ప్రజల హక్కు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గాంధీ, నిమ్స్, ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే పరీక్షలు, చికిత్సలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యంగ విరుద్ధమని.. ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. అయితే కరోనా పరీక్షలు, చికిత్సలు చేయాలనుకునే  ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు కచ్చితంగా ఐసీఎంఆర్ అనుమతి పొందాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు అనుమతివ్వాలని గంటా విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది.

‘‘లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా విజృంభించే అవకాశాలున్నాయి. పరిస్థితి తీవ్రమైతే ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిని ప్రభుత్వం ఎలా ఎదుర్కోగలదు. లక్షణాలున్న వారికి మాత్రమే ప్రభుత్వం కరోనా పరీక్షలు చేస్తోంది. లక్షణాలు లేకపోయినా ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి ఎవరైనా సిద్ధపడితే ప్రభుత్వానికి అభ్యంతరమేంటి? అందరికీ ప్రభుత్వమే ఉచితంగా కరోనా సేవలు అందించే బదులు ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు ప్రైవేట్‌లో పరీక్షలు, చికిత్సలకు వెళ్తామంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుంది’’ అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ప్రైవేట్‌లో చికిత్సలకు అనుమతిస్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉందని.. కరోనా గణాంకాలు దాచిపెట్టే ప్రమాదం ఉందన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రులపై నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు వైద్యం చేసేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. దరఖాస్తు చేస్తుకున్న ఆస్పత్రులు, ల్యాబ్‌లను పరిశీలించిన అనంతరం ఐసీఎంఆర్‌ నోటిఫై చేయాలని హైకోర్టు సూచించింది. అలాగే అక్కడి వైద్య సిబ్బంది, కల్పిస్తున్న సదుపాయాలను సైతం పరిశీలించి నోటిఫై చేయాలని సూచించింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని ఐసీఎంఆర్‌ను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని