పోలీసు నుంచి పోలీసుకు!
close

తాజా వార్తలు

Published : 29/05/2020 09:21 IST

పోలీసు నుంచి పోలీసుకు!

మూడు కమిషనరేట్ల సిబ్బందిలో పెరుగుతున్న బాధితులు
లక్షణాలుంటే విధులకు వద్దంటున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో కొన్నాళ్లుగా మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ పోలీసు శాఖనూ వెంటాడుతోంది. పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో రెండుమూడు రోజుల నుంచి కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 20 మందికి పాజిటివ్‌ నిర్ధరణ కావడం గమనార్హం. ఇప్పటి వరకు మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 35మందికి కరోనా సోకగా, మరో 15 మంది అనుమానిత లక్షణాలతో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కొత్తగా ఎస్పీఎఫ్‌ విభాగంలో పనిచేస్తున్న ఒకరికి, నగర సాయుధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారికి పాజిటివ్‌ వచ్చింది. గతంలో పలు కారణాలతో వైరస్‌ సోకుతుండగా.. తాజాగా పాజిటివ్‌ వచ్చిన ఒక పోలీస్‌ నుంచి ఇంకో పోలీసుకు సోకుతోందని వైద్యులు శాఖ ఉన్నతాధికారులకు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ఒకేచోట ఉండటంతో ఇలా అవుతోందని వివరించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌ ద్వారా ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా రావడం ఇందుకు నిదర్శనం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. జ్వరం, జలుబు లక్షణాలున్నవారు విధులకు రావద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఒకరి నుంచి మరొకరికి..

బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టినా నలుగురికి కరోనా సోకింది. చిక్కడపల్లిలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌ ద్వారా మరో కానిస్టేబుల్‌కు వైరస్‌ వచ్చింది. టాస్క్‌ఫోర్స్‌ విభాగం కానిస్టేబుల్‌ ద్వారా ఓ హోంగార్డుకు, శాలిబండలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌ ద్వారా మరో కానిస్టేబుల్‌కు సోకింది. తొలుత కరోనా సోకిన కానిస్టేబుళ్లలో ఒకరిద్దరు మాత్రమే అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించి ఇళ్లకు పరిమితం కాగా.. మరి కొందరికి లక్షణాలే కనిపించలేదు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం కానిస్టేబుల్‌కు పాజిటివ్‌తో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యాలయంలో కామన్‌ బాత్రూంను మూసేశారు. కరోనా నిర్ధరణ అయిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు

ఆసుపత్రులు.. ఇళ్లు.. చెక్‌పోస్టులు

కొవిడ్‌ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఎడం పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండటం, వలస కూలీలను తరలించే ప్రక్రియ తదితరాల్లో నిత్యం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆసుపత్రుల వద్ద విధుల్లో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో వైరస్‌ ఉన్నా విధుల కోసం బయటకు వచ్చిన నలుగురు పోలీసులకూ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. మనవడికి అస్వస్థతగా ఉండటంతో ఓ పోలీసు అధికారి నాలుగురోజులు ఆసుపత్రిలోనే రాత్రిళ్లు ఉన్నారు. తర్వాత రెండురోజులకే ఆయనకు వైరస్‌ సోకింది. తూర్పులో ఓ ఠాణా, పశ్చిమ మండలంలోని మరో ఠాణా పరిధిలోని కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని