
తాజా వార్తలు
ఆ 630 మంది ఎక్కడ?
‘ఆపరేషన్ ముస్కాన్’లో రక్షించిన చిన్నారుల స్థితిగతులపై డాక్యుమెంటరీ
ఈనాడు, హైదరాబాద్: గత ఏడాది ఆపరేషన్ స్మైల్(జనవరి), ఆపరేషన్ ముస్కాన్(జులై) కార్యక్రమాల్లో భాగంగా.. పని ప్రదేశాల నుంచి విముక్తి పొందిన చిన్నారులు, భిక్షాటన చేస్తుండగా రెస్క్యూ చేసిన చిన్నారులు ఇప్పుడెలా ఉన్నారనే విషయంపై ఆరా తీయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా రక్షించిన సుమారు 630 మంది చిన్నారుల్ని అప్పట్లోనే వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ప్రస్తుతం వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? చదువుకుంటున్నారా? మళ్లీ ఎవరైనా కనిపించకుండా పోయారా? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. అలానే తెలంగాణవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో నమోదైన చిన్నారుల అదృశ్యం కేసుల వివరాల్ని క్రోడీకరిస్తున్నారు. ఆ వివరాల్ని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్)తో పాటు, ‘ట్రాక్ ది మిస్సింగ్ ఛైల్డ్’ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు తెలంగాణలోని పోలీస్ యూనిట్లకు ప్రత్యేక యూజర్ఐడీ, పాస్వర్డ్లు లేకపోవడంతో పోర్టల్లో నమోదు ప్రక్రియ సవ్యంగా జరగలేదు. ఈసారి తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్ని యూనిట్లకు యూజర్ఐడీ, పాస్వర్డ్లను ఇప్పించారు. అదృశ్యమైన చిన్నారుల చిత్రాల్ని దర్పణ్ యాప్ ద్వారా సరిపోల్చుతూ వివరాలు కనుగొనే ప్రయత్నంలో నిమగ్నయ్యారు.
చిన్నారుల పూర్తి వివరాలు సేకరిస్తాం
ఈ నెలాఖరు నాటికి 630 మంది రక్షిత చిన్నారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తాం. ఈ అంశంపై సిమ్బయాసిస్ లా కళాశాల విద్యార్థులు సర్వే చేసి డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఈ సర్వే అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. రక్షిత చిన్నారుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నాం.
- స్వాతిలక్రా, అదనపు డీజీపీ, తెలంగాణ మహిళా భద్రత విభాగం