
తాజా వార్తలు
వినాయకా.. రక్షించవయా..!
● విగ్రహాల తయారీపై కరోనా ప్రభావం
● ఆర్డర్లు లేక ఇబ్బందుల పడుతున్నామన్న తయారీ దారులు
రాయగడ, న్యూస్టుడే: అమలాపేట గ్రామం వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. జిల్లా కేంద్రానికి 15 కి.మీ.దూరంలో సుమారు 60 కుటుంబాలు ఈ విగ్రహాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వినాయకచవితికి 3 నెలల ముందు నుంచే ఇక్కడ వినాయక విగ్రహాల కొనుగోలు హడావిడి మొదలవుతుంది. జిల్లా వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కురుపాం, పార్వతీపురం ప్రాంతాల నుంచి విగ్రహాలు కొనుగోలు వస్తారు. అలాంటి అమలపేట ప్రస్తుతం జన సందడి లేక మూగబోయింది. కరోనా వీరి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ కారణంగా ఇంత వరకు ఎవరూ విగ్రహాలు ముందస్తు ఆర్డరు చేసుకోలేదని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది పెద్ద విగ్రహాలు తయారీని నిలిపివేసామని చిన్నవి మాత్రమే తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ కూలీలుగా మారిన మహిళలు
ఈ సమయానికి చేతినిండా పని ఉండేదని ఇప్పుడా పరిస్థితి లేక వ్యవసాయ కూలీలుగా మారినట్లు మహిళలు వాపోయారు. విగ్రహాలు తయారీ లేకపోవడంతో మొక్కల కుండీలు తయారీ చేస్తున్న ఆదరణలేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. చవితి నాటికి కొవిడ్ తగ్గుముఖం పడితే అందరూ తొలిపూజలు చేసుకుంటారని చిన్న విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విగ్రహాలను కొనుగోలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.