close

తాజా వార్తలు

Published : 10/08/2020 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిప్పు రాజుకుంటే.. ముప్పు తప్పదు

ఈనాడు, హైదరాబాద్‌

గతంలో అగ్ని ప్రమాదం జరిగిన ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి

విజయవాడలో కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం తీసుకున్న ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగి పది మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మహమ్మారి నుంచి బయట పడేందుకు చేరిన వారు అనుకోని ప్రమాదంలో విగత జీవులుగా మారడం బంధువులను కలిచివేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని ఆసుపత్రుల్లో రోగుల భద్రత చర్చనీయాంశమవుతోంది.

త ఏడాది అక్టోబరులో ఎల్బీనగర్‌లోని షైన్‌ చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం తరవాత అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని సుమారు 1800 ఆసుపత్రులకు తుది తాఖీదులు జారీ చేసింది. కరోనా వల్ల తనిఖీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో అధికులు కొవిడ్‌ వైరస్‌ బారినపడిన వారే. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనంలో అగ్ని ప్రమాదాల నివారణ సామగ్రి ఏర్పాటుకు గతంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. విజయవాడ ఘటన నేపథ్యంలో ‘గాంధీ’తోపాటు బహుళంతస్తుల భవనాలు, ఇతర ఆసుపత్రులు, హోటళ్లపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు గాలికి...

నగరంలో దాదాపు 4 వేల ఆసుపత్రులున్నాయి. 10-100 పడకలు ఉన్నవే ఎక్కువ. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు తప్ప చాలా వరకు నిబంధనలకు నీళ్లొదిలాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సందులు, గల్లీల్లో వైద్యశాలలు ఏర్పాటయ్యాయి. భవన నిర్మాణం, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఇతర అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పోలీసు శాఖ నుంచి యాజమాన్యాలు అనుమతులు తీసుకోవాలి. ఆయా శాఖల్లోని కొందరు అధికారులు.. ఆసుపత్రుల లొసుగులే అస్త్రంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో పక్కాగా తనిఖీలు చేసి అనుమతివ్వాలి. తొలుత 90 రోజులకు తాత్కాలికంగా అనుమతి పత్రం ఇవ్వాలి. నిబంధనల ప్రకారం నడుస్తున్నాయని భావిస్తే అయిదేళ్లకు పొడిగించాలి. ముడుపుల యావలో ఇవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగా 1800 ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు సరిగా లేవని జీహెచ్‌ఎంసీ గుర్తించిందంటే అనుమతుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు.


సిబ్బందికి తగిన శిక్షణ ఏదీ

ఆసుపత్రి భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటే ఫస్ట్‌ఎయిడ్‌ హోస్‌రీల్‌, 5 వేల లీటర్ల నీటి ట్యాంకు, స్ప్రింక్లర్స్‌, స్మోక్‌ డిటెక్టర్స్‌తోపాటు ఆసుపత్రి సిబ్బంది శిక్షణ పొంది ఉండాలి.

5 అంతస్తులకంటే ఎక్కువ ఉంటే 15 వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు, లక్ష లీటర్ల సామర్థ్యం గల నీటి సంపు, ఎల్‌పీఎం బూస్టర్‌ పంప్‌, అలారం, స్మోక్‌ డిటెక్టర్‌, స్ప్రింకర్లు, ప్రతి అంతస్తుకు రెండు నుంచి మూడు ఫైర్‌ ఎక్స్‌టింగ్‌విషర్స్‌లు ఉంచాలి.

ప్రతి మూడు, ఆరు నెలకోసారి సిబ్బందికి మాక్‌ డ్రిల్‌ తప్పనిసరి. అత్యవసరం వేళల్లో తమను తాము కాపాడుకోవడంతోపాటు రోగులను ఎలా తప్పించాలనే విషయంపై సిబ్బందికి అగ్నిమాపక శాఖ శిక్షణ ఇవ్వాలి.

చాలా ఆసుపత్రుల్లో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు.


ఆసుపత్రులు, బహుళంతస్తుల భవనాల్లో ఇవన్నీ పాటిస్తేనే...

ఇప్పటికే 1800 ఆసుపత్రులకు తాఖీదులు

అర్ధాంతరంగా నిలిచిన తనిఖీల ప్రక్రియ

ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల చుట్టూ 4 మీటర్ల ఖాళీ స్థలం వదలాలి.

భవనాల ముందు అద్దాలతో మూసివేయకుండా గాలి, వెలుతురు వచ్చే కిటికీలు ఏర్పాటు చేయాలి.

ప్రతి భవనంలో పది వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు లేదా సంపులు ఉండాలి. నీటిని తోడటానికి మోటార్లు అమర్చాలి.

నియంత్రిక ఉంటే చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. 45 లీటర్ల ఫోమ్‌ట్రాలీ, కంకరతో సోప్‌పిట్‌ ఏర్పాటు చేసుకోవాలి.

అత్యవసర వేళల్లో ఉపయోగించుకోవటానికి రెండో మెట్లదారి ఉండాలి.

అధిక విద్యుత్తు వచ్చినప్పుడు సరఫరా నిలిచిపోయేలా సర్క్యూట్‌ బ్రేకర్లు అమర్చుకోవాలి.

ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్సులు, హోటళ్లలో పనిచేసే సిబ్బందికి అవగాహన పెంచేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆరు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ చేసి చూపించాలి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.