close

తాజా వార్తలు

Updated : 21/09/2020 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

10 రోజులు దాటితే నెగెటివ్‌!

అప్పటివరకు ‘పాజిటివ్‌’ 

వ్యక్తుల ఆరోగ్యంపై నిత్యం ఆరా

హితం పోర్టల్‌ ద్వారా ఆరోగ్య  సలహాలు, సమాచార సేకరణ

ప్రతిదీ ఆన్‌లైన్‌లో భద్రం

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ వ్యక్తుల్లో కోలుకున్నవారు 81.54 శాతం. ఈ అంశంలో జాతీయ సగటు 79.65 శాతం. ఒక్కరోజులో ఎందరు కొవిడ్‌ బారిన పడుతున్నారో.. అంతేరీతిలో కోలుకుంటున్నారు. బాధితుల్లో దాదాపు 78 శాతం మంది ఐసొలేషన్లలో చికిత్స పొందుతున్నవారే. ఎవరు ఎలా కోలుకుంటున్నారు? ఏ బాధితుడు ఆసుపత్రిలో చేరుతున్నాడు? భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల మేరకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలూ కొవిడ్‌ కేసులు, చికిత్స, మరణాలు ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేస్తున్నాయని.. తద్వారా ఈ సమాచారం అందరికీ వెల్లడించడం సాధ్యమవుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఐసొలేషన్‌లో ఉంటున్న దాదాపు 99 శాతం మందితో హితం పోర్టల్‌ ద్వారా నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు.

కోలుకున్నట్లు నిర్ధారణ ఎలా?

* రాష్ట్రంలోని కొవిడ్‌ బాధితుల్లో 70 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండా నిర్ధారణ అయినవారే ఉన్నారు. 

వీరిలో 95 శాతం మంది ఇళ్ల వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. 5 శాతం వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉంటున్నారు. 

* లక్షణాలు తీవ్రంగా ఉన్నవారు, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలున్నవారు మరో 15-20 శాతం మంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

* ఈ క్రమంలో ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నవారిని హితం పోర్టల్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.

* వీరితో నిత్యం రెండు రకాలుగా సంప్రదింపులు జరుపుతోంది. మొదటిది.. సాధారణ ఫోన్‌ కాల్‌ ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడం. రెండోది.. వైద్యుని సంప్రదింపులు, సలహాలు.

* ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లలో చికిత్స పొందుతున్న వారిలో తొలి 10 రోజుల పాటు అనారోగ్య సమస్యలు లేకపోతే.. వారిని నెగెటివ్‌గానే పరిగణిస్తారు.

* వీరిని మళ్లీ పరీక్షించాల్సిన అవసరం లేదు. వీరి సమాచారాన్ని కోలుకున్నవారి జాబితాలో చేర్చుతారు. వీరు అదనంగా మరో 7 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.

* ఒకవేళ ఈ 10 రోజుల్లోపు లక్షణాలు తీవ్రమై.. ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. అక్కడ కోలుకున్న తర్వాత ఆ సమాచారాన్ని ఆసుపత్రి నుంచి ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు.

* దీంతో ఎప్పటికప్పుడు కోలుకుంటున్నవారి సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యమవుతుంది. ఇలా రాష్ట్రాల నుంచి వచ్చిన వివరాలను కేంద్రం ప్రకటిస్తోందని వైద్యవర్గాలు తెలిపాయి.

10 రోజుల తర్వాత సమస్య వస్తే..

కరోనాగా నిర్ధారణ అయిన తొలి 10 రోజుల్లోపు లక్షణాలు తగ్గినట్లుగా కనిపించినా.. కొందరిలో ఆ తర్వాత.. రెండు, మూడు వారాల్లోనూ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తొలివారంలో కొవిడ్‌ వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, 10 రోజుల తర్వాత వైరస్‌ శరీరంలో ఉండదని పేర్కొన్నారు. 10 రోజుల్లోపు సమస్యలేమీ లేనివారిని కరోనా నుంచి కోలుకున్నవారిగా ప్రకటిస్తామన్నారు. అయితే వైరస్‌ లేకపోయినా.. అది తొలుత చూపిన దుష్ప్రభావం కారణంగా రెండోవారంలో కొందరిలో ఇతర సమస్యలు వస్తాయనీ, దీన్ని కొవిడ్‌ తగ్గిన తర్వాత ఎదురయ్యే సమస్యలు(పోస్ట్‌ కొవిడ్‌ ప్రాబ్లెమ్స్‌)గా నిపుణులు పరిగణించి వారికి అవసరమైన చికిత్స అందిస్తారని వివరించారు. వయసు పైబడినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.. కొవిడ్‌ లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా చికిత్స పొందాలని సూచించారు.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.