close

తాజా వార్తలు

Published : 29/10/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలా మొదలైన కథ.. అనంతలో సుఖాంతం

వైద్యుడి కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

అనంత నేరవార్తలు, రాప్తాడు: హైదరాబాద్‌లో దంత వైద్యుడి అపహరణ అనంత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సినీఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. ఓ సారి చేజారిపోయినా నాలుగు వైపులా వల పన్నీ.. చరవాణి సంకేతాల ఆధారంగా విజయం సాధించారు. బుధవారం తెల్లవారుజామున 4.20 గంటలకు మొదలైన ప్రక్రియ ఉదయం 6.20 గంటలకు ముగిసింది. ఎట్టకేలకు వైద్యుడిని కాపాడారు. నగర డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో సీఐలు జాకీర్‌హుసేన్‌, రెడ్డప్ప రాప్తాడు ఎస్సై ఆంజనేయులు కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించారు.

అసలు ఏం జరిగిందంటే..

●సమయం: తెల్లవారుజామున 4 గంటలు.. నగరంలోని సీఐలు తమ పరిధిలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ సత్యఏసుబాబుకు హైదరాబాద్‌ పోలీసుల నుంచి వైద్యుడి అపహరణ సమాచారం వచ్చింది. దీంతో ఆయన నగర పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.

●సమయం: 4.15 గంటలు

సీఐ జాకీర్‌హుసేన్‌, రెడ్డప్ప తపోవనం కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టారు.

●సమయం: 4.20 గంటలు

ఓ బొలేరో వాహనం వేగంగా వచ్చి ఆగింది. వాహనం వద్దకు పోలీసులు చేరుకునే లోపు వాహనం సర్వీసు రోడ్డు వైపు వేగంగా వెళ్లిపోయింది.

●ఉదయం 6.20 గంటలు

అనంతపురం నుంచి వెళ్లిన సీఐలు గాలిస్తుండగా రాప్తాడు ఎస్సై బుక్కచెర్ల సమీపంలోకి వెళ్లారు. అక్కడ కిడ్నాపర్లు దారి ఎలా వెళ్లాలో తెలియక వాహనాన్ని వదిలిపారిపోయారు. పోలీసులు ఒక కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. వాహనంలో ఉన్న దంతవైద్యుడిని రక్షించారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు కనురెప్పవాల్చకుండా అప్రమత్తంగా ఉంటూ, మెరుపు వేగంతో రాప్తాడు పరిసర ప్రాంతాల్లోని అన్ని గ్రామీణ రోడ్లను అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకున్నారు. వైద్యుడిని రక్షించి, కిడ్నాపర్‌ను హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

రూ.10 కోట్లు ఇవ్వాలంటూ వాయిస్‌ మెసేజ్‌

రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని కిస్మత్‌పూర్‌లో నివాసముండే బెహ్‌జాత్‌ హుస్సేన్‌(56) దంతవైద్యుడు. బండ్లగూడ జాగీర్‌లోని క్లినిక్‌లో ఉండగా మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు నలుగురు వ్యక్తులు నల్లటి బురఖాల్లో వచ్చి కిడ్నాప్‌ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ వైద్యుడి భార్యకు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ను పంపించారు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు నిందితులు రాత్రి ఒంటి గంటకు శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌ దగ్గర దిగి బెంగళూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతపురం ఎస్పీని అప్రమత్తం చేయగా.. రాప్తాడులో నిందితుల కారును పట్టుకున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు పరారయ్యారు. సంజయ్‌(19) పోలీసులకు చిక్కాడు. రెండు సీట్ల మధ్య చేతులు, కాళ్లు కట్టేసి బెడ్‌షీట్‌లో చుట్టిన బాధితుడిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. సంజయ్‌ ఇచ్చిన సమాచారం మేరకు.. కూకట్‌పల్లి, రెడ్‌హిల్స్‌లో పుణేకు చెందిన సుమిత్‌ చంద్రకాంత్‌ భోంస్లే, అక్షయ్‌ బాలు(24), విక్కీ దత్త షిండే(20), ఫలక్‌నుమా నివాసి మహ్మద్‌ రహీం (18), బీదర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌(21), మహ్మద్‌ ఇర్ఫాన్‌(25)ను అరెస్ట్‌ చేశారు.

డీజీపీ ప్రశంస

కిడ్నాపర్లను చాకచక్యంగా పట్టుకున్న అనంత పోలీసులను రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. ఇలాంటి నేరాలను అరికట్టడం వల్ల ప్రజలకు పోలీసులపై దృఢమైన నమ్మకం, భరోసా కలుగుతాయన్నారు. నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల పనితీరుకు ఈ ఘటన ఓ ఉదాహరణ అన్నారు. హైదరాబాద్‌ కిడ్నాపర్లను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు ప్రశంసించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.