close

తాజా వార్తలు

Published : 28/11/2020 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంతం.. పల్లె రక్తసిక్తం

పల్నాడు ప్రాంతంలో వెలుగు చూస్తున్న ఘటనలు


చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దాడుల్లో పాల్గొని వెళుతున్న ఒక వర్గం

 నరసరావుపేట: అధికార పార్టీలో ఆధిపత్య పోరుతో పల్నాడులోని పలు గ్రామాలు రక్తసిక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో కలసి కదలిన నేతల మధ్యనే వర్గపోరు రాజుకుని విభేదాలు పొడచూపడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గం కట్టుబడివారిపాలెంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. ఇక్కడ వైకాపాలో మాజీ సర్పంచులుగా ఉన్న ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో ఘర్షణ జరిగి పదిమంది గాయపడ్డారు. రెండు వర్గాలకు చెందిన 33మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కట్టుబడివారిపాలెంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఇళ్లను వదలి పరారీలో ఉన్నారు.

వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో అధికార పార్టీ వారే అదే పార్టీ వ్యక్తిని హత్య చేశారు. గోదెలవీడులో అధికార పార్టీలో రెండువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మండాది గ్రామంలో వైకాపాలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని కేసులు పెట్టుకున్నాయి. దుర్గి మండలం అడిగొప్పలలో వైకాపాలోని రెండు వర్గాలు ఘర్షణ పడి కేసులు పెట్టుకున్నాయి. దాచేపల్లిలో అధికార పార్టీలోని రెండు వర్గాలు క్వారీ విషయంలో ఘర్షణ పడడటంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో అధికార పార్టీలోనే రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

చట్టం అంటే భయం లేకుండా బరి తెగిస్తున్నారు. కట్టుబడివారిపాలేనికి చెందిన వైకాపాలోని రెండు వర్గాలు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాయి. ఆసుపత్రిలోనే ఒక వర్గంపై మరో వర్గం కత్తులు, కర్రలతో దాడి చేయటంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. గర్భిణులు, బాలింతలు పరిగెత్తలేక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

చర్యలు తీసుకుంటేనే..

పోలీసులు తాత్సారం చేయకుండా యుద్ధప్రాతిపదికన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వేచి చూస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తినా తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకుంటే చాలావరకు ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంటుంది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని