
తాజా వార్తలు
వాగు దాటలేక.. పెళ్లి వాయిదా
బి.కొత్తకోట: పెద్దమండ్యం మండలం పాపేపల్లె వద్ద పొంగి పొర్లుతున్న వాగును పెళ్లి కూతురుతో పాటు బంధుమిత్రులు దాటి కళ్యాణ మండపానికి వెళ్ల లేక..వివాహాన్ని వాయిదా వేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వరుడి సోదరుడు శ్రీనివాసులు కథనం మేరకు.. పాపేపల్లెకు చెందిన ఓ యువతికి బి.కొత్తకోట మండలం దేవరాజుపల్లెకు చెందిన సుధాకర్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకను శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గట్టులోని శ్రీవెంకటరమణస్వామి కల్యాణ మండపంలో జరపాలని పెద్దలు నిర్ణయించారు. అంతకు ముందు గురువారం రాత్రి రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరిగాయి. పాపేపల్లె నుంచి పెళ్లి కూతురు బంధువులు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రెండు బస్సుల్లో గట్టుకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా ఎడతెరిపి లేకుండా వాన కురియడంతో పాపేపల్లె వద్ద ఉన్న వాగు జోరుగా ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయానికి కూడా పాపేపల్లె వాగు జోరు తగ్గకపోవడంతో పెళ్లి పెద్దలు చరవాణి ద్వారా సంప్రదింపులు జరిపారు.వివాహాన్ని వాయిదా వేశారు.