ప్రేమించిన అబ్బాయికి ఆ విషయం తెలిస్తే?
close

తాజా వార్తలు

Published : 28/11/2020 23:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమించిన అబ్బాయికి ఆ విషయం తెలిస్తే?

నేను ఇంటర్‌ వరకు బాలికల పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు కో-ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా చిన్ననాటి స్నేహితుడు కూడా ఇదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. చదువయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నాం. అయితే ఈమధ్య నేను మరొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అతడికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే... వారిద్దరూ కలిసి చదువుకున్నారు. పైగా మంచి స్నేహితులు. తన చిన్నప్పటి స్నేహితుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేనిప్పుడు ఇష్టపడే వ్యక్తికి తెలియదు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

మీ వయసులో ప్రపంచం అందంగా కనపడటం, కొత్త విషయాలకు ఆకర్షితులు కావడం సహజమే. ఒకదాన్ని మించి మరొకటి ఆకర్షణీయంగా కనపడితే మనసు ఆ దిశగా మళ్లడమూ సహజమే. ప్రస్తుతం మీ మనస్థితి అలాంటిదే. ఇన్నేళ్లూ మీకు మీ చిన్ననాటి స్నేహితుడు తప్ప వేరే వ్యక్తులతో పెద్దగా పరిచయాలు లేవు. సన్నిహితంగా ఉండే అబ్బాయిలు ఎవరూ లేరు. అందుకే ఇన్నిరోజులూ మీ స్నేహితుడితో ప్రేమలో ఉన్నాను అనుకున్నారు. ఇప్పుడు కొత్త వ్యక్తి మెరుగ్గా కనపడుతున్నాడు కాబట్టి అతడితో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రేమ అనుకుంటున్నారు. రేపు మీ అభిరుచి మరోలా ఉండొచ్చు. ఇవేవీ ఎక్కువ రోజులు నిలిచే బంధాలు కావు. ఈ వయసులో మీరు ఏర్పరచుకునే భావోద్వేగాలు క్రమంగా పల్చబడొచ్చు. అందువల్ల భవిష్యత్తు గురించి మీరు ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీరాలని నిర్ధారించుకోకండి. ఉన్నతంగా స్థిరపడిన తరువాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించండి. వారిద్దరికీ ఇచ్చే ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ చదువు, ఇతర ఆసక్తుల మీదకు దృష్టి మళ్లించండి. రోజులు గడిచేకొద్దీ మీరే తేడా గమనిస్తారు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకుని భవిష్యత్తులో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటే... మీపై వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రేమ విషయంలో వారు ఎంత సీరియస్‌గా ఉన్నారు? అన్ని విషయాల్లోనూ మీకు తోడుగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారా..? వంటి విషయాలను ఒక్కొక్కరితో విడివిడిగా చర్చించండి. ఇద్దరిలో ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత మీ అభిప్రాయాన్ని రెండో వ్యక్తికి సానుకూల వాతావరణంలో తెలియజేయండి. ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఇద్దరితో సన్నిహితంగా మెలగడం మంచిది కాదు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ధైర్యం, విజ్ఞతతో వీలైనంత త్వరగా పరిష్కరించుకోండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని