close

తాజా వార్తలు

Published : 29/11/2020 08:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చూస్తే సిగరేటు.. పీల్చితే మత్తు

జిల్లాలో గుట్టుగా గంజాయి విక్రయాలు

జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం ఆనవాళ్లు బయటపడుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్‌, యాదగిగుట్ట పట్టణాల్లో కొందరు యువకులు మత్తులో ఊగుతూ కనిపిస్తున్నారు. వీరంతా గంజాయి పీల్చడానికి అలవాటు పడిన వారే. వ్యసనపరుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని నిర్జన ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. అలవాటు పడిన వారు మాత్రం అప్పులు చేస్తూ కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు నిఘా పెట్టినా వారి కళ్లుగప్పి విక్రయిస్తున్నారు. వరంగల్‌, ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

భువనగిరి: ఇటీవల యాదగిరిగుట్ట పట్టణంలో ఓ వ్యక్తి మత్తులో తూలుతూ కింద పడ్డాడు. అతని జేబులో నుంచి చిన్న చిన్న గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. స్థానికులు నిలదీస్తే బస్టాండ్‌ వద్దే అమ్ముతున్నట్లుగా పేర్కొనడంతో అందరూ నివ్వెరపోరు.

పట్టణానికి చెందిన కొందరు గంజాయి పీల్చడానికి బానిసయ్యారు. వారు డబ్బుల కోసం కుటుంబ సభ్యులను రోజూ వేధింపులకు గురిచేస్తున్నారు. సమయానికి గంజాయి పీల్చకుంటే వింతగా ప్రవర్తిస్తున్నారు. మతి తప్పినట్లు మాట్లాడుతున్నారు.

ఇటీవల పట్టుబడిన ఘటనలు..

* ఈ నెల 20న ఇమాంపేట, హెచ్‌పీసీఎల్‌ క్రాస్‌రోడ్డు వద్ద 12 కిలోల గంజాయిని పట్టుకొని ఒకరిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు.

* సెప్టెంబరులో ఐదు కిలోల గంజాయిని కారులో ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నార్కట్‌పల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.

* సికింద్రాబాద్‌-కాజీపేట రైలు మార్గం ద్వారా గంజాయి రవాణా జరుగుతోంది. మార్గమధ్యలో ఉన్న భువనగిరి పట్టణానికి సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

* గతంలో చౌటుప్పల్‌ మండలం పతంగి టోల్‌ ప్లాజా వద్ద డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు (డీఆర్‌ఐ )శాఖ 1427 కిలోల గంజాయి, గత ఏప్రిల్‌లోనే డీఆర్‌ఐ వారే 1121 కిలోలు, గత అక్టోబరులో ఎస్వోటీ, చౌటుప్పల్‌ పోలీసులు దాడులు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుకున్నారు.

గుట్టలో గంజాయి తాగే ఓ అనుమానిత ప్రాంతం

సిగరేట్ల మాటున దందా

ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట బస్టాండ్‌, పరిసర ప్రాంతాలు, పట్టణ శివారు నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి వినియోగించే వ్యక్తులు సిగరేట్లు విక్రయించే వారీగా కనిపిస్తారు. సిగరెట్‌లోంచి పొగాకు తీసేసి లోపల గంజాయి కూర్చేసి సాదా సిగరెట్‌గా అమ్ముతున్నారు. వ్యసనపరులూ సాధారణంగా కొనుగోలు చేసి తాగుతున్నట్లు సమాచారం. వీటిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుండటం విశేషం. చరవాణి ద్వారా కోడ్‌ సమాచారం లేదా ఆయా దుకాణాల్లోనే కోడ్‌భాషలో అడిగితే గంజాయి కూర్చిన సిగరేటు ఇస్తారు. ఈ దందా చాలా గోప్యంగా సాగుతోంది.

కోడ్‌ భాషల్లో విక్రయాలు

గంజాయి మత్తుకు యువకులు ఎక్కువగా బానిసలవుతున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇది కేవలం గుట్టలోనే కాకుండా జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాలు, మారుమూల గ్రామాలకు పాకినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు మత్తు నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. వ్యసనపరులకు సమయానికి డబ్బులు లేకుంటే ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వస్తువులను తాకట్టు పెట్టేందుకు వెనకాడటం లేదు. దొరకని వారి పిచ్చిపిచ్చి ప్రవర్తిస్తున్నారు. అధికారులు నిఘా పెంచితేనే అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుంది.


గత ఏప్రిల్‌లో చౌటుప్పల్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి పొట్లాలు

ఆరోగ్య సమస్యలు వస్తాయి

-వంశీకృష్ణ, వైద్యాధికారి, యాదగిరిగుట్ట

గంజాయి తాగడం వల్ల నరాల బలహీనత, ఊపిరితిత్తుల్లో సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. నిద్ర పట్టదు. మత్తు దొరకకుంటే పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోయి అనేక రోగాల బారిన పడతారు. మత్తు కోసం నేరాలకూ వెనకాడరు. వ్యసనం మాన్పించే అవకాశాలు తక్కువ. సైకాలజిస్ట్‌ను సంప్రదించి మందులు వాడుతూ మాన్పించడానికి ప్రయత్నించవచ్చు.

నిఘా పెడతాం

-కోట్ల నర్సింహారెడ్డి, ఏసీపీ, యాదగిరిగుట్ట

గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘాపెట్టి అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదలం. మత్తు పదార్థాల రవాణా కట్టడి బాధ్యత పోలీసులదే కాదు అందరిది. గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినా.. చేరేవేసే వ్యక్తుల గురించి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వండి. తల్లిదండ్రులూ తమ పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన