
తాజా వార్తలు
పెద్దలకు చెప్పలేక..మనసు మాట కాదనలేక
ప్రేమజంట ఆత్మహత్య
కుటుంబ సభ్యులకు చెప్పిఉంటే బతికేవారేమో ?
ఇరు కుటుంబాల్లో విషాదం
పెట్రోలింగ్‌లో పోలీసులు పట్టుకున్నా వదిలేశారు
ఆర్మూర్ పట్టణం, వేల్పూర్ ఇందూరు సిటీ
ముక్కుపచ్చలారని జీవితం అప్పుడే ముగిసిపోయింది. పెద్దలను ఒప్పించే ధైర్యం లేక.. భవిష్యత్తులో కలిసుండలేమనే భయంతో అబ్బాయి, యువతి ఒకే చున్నీతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని మృత్యు ఒడికి చేరారు. ఈ ఘటన వెనక ఎన్నో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు జాగ్రత్త పడినా.. పోలీసుల కంటపడినప్పుడు వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడి ఉంటే ఈ అఘాయిత్యం జరగకుండా నిలువరించే వారు. కానీ, ఎవరూ ఆ ఆలోచన చేయలేదు.
ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ శివారులో శనివారం తెల్లవారుజామున ప్రేమజంట ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణానికి చెందిన అమ్మాయి(18), వేల్పూర్ మండలానికి చెందిన బాలుడు(17) రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. యువతి ఆర్మూర్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బాలుడు హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఓ పరీక్ష కేంద్రంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల్లో ప్రేమ వ్యవహారం తెలియడంతో భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. వివరాలు ఆరా తీసిన పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలుడిని అక్కడి నుంచి పంపించారు. యువతిని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. వారు వెళ్లిపోగానే తిరిగి కలుసుకొన్న బాలుడు, యువతి పెర్కిట్ శివారులోని మామిడి తోటలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
రోదిస్తున్న బంధువులు
కన్నీటి పర్యంతం: బాలుడి తండ్రి వీఆర్వోగా పని చేస్తున్నారు. యువతి తండ్రి గల్ఫ్‌లో పని చేస్తున్నారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకొని రోదించారు.
పోలీసులు జాగ్రత్త పడితే.. ప్రేమజంట శుక్రవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులకు కనిపించారు. వివరాలు తెలుసుకొని బాలుడి చరవాణి తీసుకొన్నారు. ఉదయం తండ్రిని తీసుకొని ఠాణాకు రావాలని అక్కడి నుంచి పంపించేశారు. యువతిని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఇంతటితో సరిపెట్టారు తప్పిస్తే.. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో తెల్లారేసరికి చెట్టు కొమ్ముకు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు.