close

తాజా వార్తలు

Updated : 30/11/2020 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పులి పంజాకు మరో ప్రాణం బలి

పత్తి ఏరుతుండగా బాలికపై దాడి
కుటుంబసభ్యుల కళ్లెదుటే నోట కరచుకుని లాక్కెళ్లిన పెద్దపులి
కుమురంభీం జిల్లాలో రెండో భయానక ఘటన

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: న్యూస్‌టుడే, పెంచికల్‌పేట్‌, బెజ్జూర్‌: పత్తి ఏరుతున్న బాలికపై బెబ్బులి పంజా విసిరింది. తల్లి, సోదరుడు, ఏడుగురు కూలీల కళ్లెదుటే బాలికను నోట కరచుకుని ఈడ్చుకెళ్లింది. మిగతావారు దాన్ని వెంబడిస్తూ గట్టిగా కేకలు వేయడంతో వదిలేసి పోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోగా మృతదేహాన్ని కూలీలు వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో ఆ మృగం మళ్లీ వారివైపు రావడంతో కర్రలతో బెదరగొట్టగా ఎట్టకేలకు అడవిలోకి పారిపోయింది. ఈ భయానక ఘటన కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి శివారులో ఆదివారం జరిగింది. రైతు అన్నెం సత్తెయ్య చేనుకు నిర్మల(16), ఆమె సోదరుడు రాజేష్‌, తల్లి లక్ష్మక్క, మరో ఏడుగురు కూలీలు ఆదివారం ఉదయం పత్తి ఏరేందుకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో కూలీలు, సోదరుడు, తల్లి చేనుకు ఒకవైపు భోజనం చేస్తున్నారు. నిర్మల తన స్నేహితురాలితో కలసి మరోవైపు పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో హఠాత్తుగా నిర్మలపై దాడిచేసిన పులి ఆమెను నోట కరచుకుని పోయింది. నిర్మల అరుపులతో ఉలిక్కిపడిన అక్కడున్నవారంతా మృగాన్ని వెంబడిస్తూ కేకలు వేయడంతో బాధితురాలిని కొద్దిదూరంలో వదిలి వెళ్లిపోయింది. నడుం, మెడపై తీవ్రగాయాలు కావడంతో ఆ బాలిక ఘటనాస్థలిలోనే చనిపోయింది. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎఫ్‌వో శాంతారాం ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.5లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

18 రోజుల వ్యవధిలోనే మళ్లీ ఘోరం..

దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌(19)ను పులి ఈ నెల 11న గ్రామ సమీపంలోనే వాగు పక్కన హతమార్చింది. 18 రోజుల అనంతరం మళ్లీ కొండపల్లిలో నిర్మలను పొట్టనపెట్టుకుంది. రెండు రోజుల కిందట పెంచికల్‌పేట్‌ మండలం ఆగర్‌గూడ పెద్దవాగు వద్ద పులి గ్రామస్థులకు కనిపించింది. ఈ మూడు ప్రాంతాలు అయిదు నుంచి 15 కి.మీ. పరిధిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో విఘ్నేష్‌, నిర్మలలను హతమార్చిన పులి ఒక్కటేనని స్థానికులు అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాల ప్రజలు బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఒక్కసారి మనిషి రక్తం రుచి మరిగిన పులి దాని కోసమే చూస్తుందని, జంతువులను వేటాడదని అటవీ అధికారులే చెబుతున్న క్రమంలో.. ఆ బెబ్బులిని బంధించేందుకు తక్షణం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని