
తాజా వార్తలు
ఓటు వేయడం ఎంతో సులువు
ఈనాడు, హైదరాబాద్
చదువుకున్నవారు, చదువులేనివారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇదో ప్రహసనంలా ఎవరూ భావించకూడదు. ఓటు వేయడం ఎంతో సులువు.. ఎక్కువ సమయం పట్టదు.. ఎక్కువ దూరం వెళ్లనక్కర్లేదు.. పనులు మానుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అవేంటో చూద్దాం.
భయం అక్కర్లేదు
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు నిల్చునేందుకు వీలుగా మార్కులు వేశారు. శానిటైజర్ బాటిళ్లను ఉంచారు. ఓటు వేసే ముందు, తర్వాత శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. మాస్కు ధరించి కేంద్రానికి వెళ్లవచ్ఛు
ఉదయపు నడకతో వెళదాం..
మనలో చాలామంది ఉదయపు నడకకు వెళుతుంటాం. ఈ రోజు పోలింగ్ కేంద్రాలకు మన దారిని మళ్లించుకుందాం. కేంద్రం 500 మీటర్ల నుంచి కిలోమీటరు లోపే ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డుతో అలా వెళ్లి ఓటు వేసి తర్వాత మళ్లీ నడక లేదా జాగింగ్ కొనసాగించవచ్ఛు
భారీ క్యూలు ఉండవు
గతంలో పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 900కు మించదు. నగరంలో 9101 కేంద్రాలున్నాయి. దీంతో ఎక్కువ మంది ఓటర్లు కేంద్రాల్లో ఉంటారని, భారీగా లైన్లు ఉంటాయన్న బెంగ అవసరం లేదు.
ఎక్కువ దూరం కాదు..
నగరంలోని 2,937 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మన ఇంటి నుంచి కిలోమీటరు లోపే ఒక్కోటి ఉంటుంది. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 500 మీటర్ల లోపే ఏర్పాటుచేశారు. నడుచుకుంటూ వెళ్లినా 5 నుంచి పది నిమిషాల్లో చేరుకుని ఓటు వేసి తిరిగి రావొచ్ఛు
సమయం పెరిగింది..
గతంలో పోలింగ్ సమయం సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కొందరు వ్యాపారులు, నగర శివారుల్లో ఉద్యోగాలు చేసే ప్రైవేటు ఉద్యోగులు ఇంటికి చేరుకునేసరికి పోలింగ్ ముగిసేది. ఈసారి సమయం సాయంత్రం 6 వరకు ఉంది. దీంతో ఉద్యోగులు సాయంత్రం 5.30 కల్లా తిరిగి వచ్చి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్ఛు
ఓటరు స్లిప్ లేకపోతే..?
చీటీ అందలేదని కొందరు ఓటుకు దూరంగా ఉంటారు. జాబితాలో పేరు ఉంటే చాలు వేయవచ్ఛు పోలింగ్ కేంద్రం సమీపంలో పార్టీల ప్రతినిధులు ప్రత్యేకంగా శిబిరాలు వేసుకుని ఉంటారు. ఓటరు స్లిప్ ఇవ్వడంలో వారు సహకరిస్తారు.
ఇవీ చదవండి...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి