
తాజా వార్తలు
పూజారులపై చర్నాకోలతో వైకాపా నాయకుడి దాడి
బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకార దేవస్థానం పూజారులపై వైకాపా నాయకుడు, ఆలయ అధ్యక్షుడు పిట్టం ప్రతాప్‌రెడ్డి చర్నాకోలతో దాడి చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. దేవస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి అటెండర్ ఈశ్వరయ్య దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అక్కడికి వచ్చిన పూజారి సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణి రాత్రివేళ టిక్కెట్లు ఇవ్వకూడదన్న నిబంధనను గుర్తుచేశారు. దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగి తోసుకున్నారు. కింద పడ్డ ఈశ్వరయ్య.. ఆలయ అధ్యక్షుడు పిట్టం ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆలయ సూపర్వైజర్ నాగరాజు, మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చారు. ప్రతాప్‌రెడ్డి చర్నాకోలతో పూజారులపై దాడిచేయగా.. వెంట వచ్చిన వ్యక్తులు కర్రలతో వెంబడించి కొట్టారు. తప్పించుకునేందుకు చక్రపాణి గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై రాజారెడ్డి కేసు నమోదు చేశారు.దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించి విచారణకు ఆదేశించారు. పూజారులపై దాడిచేసిన ఆలయ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని ఏపీ అర్చక సమాఖ్య కోరింది.