
తాజా వార్తలు
చోరీ చేస్తాడు.. మిత్రుడికి ఇస్తాడు
మహేశ్వరం, న్యూస్‌టుడే: దొంగతనం చేసేటపుడు బంగారు నగలు కనిపించినా.. వాటిని తీసి పక్కన పెట్టి డబ్బు కట్టలే తీసుకెళ్తాడు. నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆ డబ్బు ఇస్తాడు. తనకు సిగరెట్లు, మద్యానికి అవసరమైనంత మాత్రమే అతడి నుంచి తీసుకుంటాడు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న దర్పల్లికి చెందిన సబావత్ పవన్(20) దశాబ్దం క్రితమే తల్లిదండ్రులతో పాటు వలస వచ్చి మంఖాల్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రజయ్ వర్జిన్ కౌంటీలో చోరీ చేశాడు. బీరువాలో రూ.7 లక్షలతో పాటు విలువైన బంగారు నగలున్నాయని వాటిని వదిలేసి డబ్బును మాత్రమే తీసుకెళ్లి, మంఖాల్‌లోని స్నేహితుడు గుండ్ల కిరణ్‌కుమార్‌కు ఇచ్చాడు. ప్రజయ్ వర్జిన్ కౌంటీలో వేర్వేరు ఇళ్లలో గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాలల్లోనూ దొంగతనం చేశాడు. సీసీ ఫుటేజీల ద్వారా మహేశ్వరం పోలీసులు నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు. కేసును చేధించిన సీఐ మదుసూధన్, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, పోలీసుకానిస్టేబుళ్లు నర్సింహాయాదవ్, శ్రీధర్‌లకు ఇబ్రాహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి నగదు రివార్డులను అందించారు.