
తాజా వార్తలు
విగ్రహాల చోరీ.. పోలీసుల హడావుడి

వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
ఈనాడు, అమరావతి: దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, చోరీ కేసులపై ప్రస్తుతం రాష్ట్రంలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో గుంటూరు నడిబొడ్డున దేవుళ్ల విగ్రహాలు రెండు చోరీ చేయడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గుంటూరు తూర్పు డివిజన్ పరిధిలో ఈ చోరీ జరగడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. రక్షక్ వాహనాల హారన్లు.. ఏ వీధిలో చూసినా పోలీసుల హడావుడి కనిపించడంతో ప్రజలకు ఏం జరిగిందో తొలుత అర్థం కాలేదు. ఎట్టకేలకు చోరీకి గురైన విగ్రహాలతో పరారవుతున్న దొంగ పోలీసులకు చిక్కడంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గంట వ్యవధిలోనే కేసు ఛేదించటంతో అర్బన్ జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందాయి. ఇప్పటికే ఆలయాల ఘటనలతో వాతావరణం వేడెక్కుతోంది. గుంటూరులో పట్టపగలు అత్యంత రద్దీగా ఉండే జిన్నాటవర్కు సమీపంలో ఆలయంలో చోరీ జరగడం పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సరిగ్గా 10.40 నిమిషాలకు విగ్రహాలు మాయమైనట్లు ఫిర్యాదు అందుకున్న కొత్తపేట పోలీసులు వెంటనే విషయం తూర్పు డీఎస్పీ సీతారామయయ్యకు తెలియజేశారు. ఆయన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 11 గంటలకు నేరుగా ఆయన కూడా రంగంలోకి దిగారు. అప్పటికే డీఎస్పీ ఆరుగురు ఎస్సైలు, పది మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లతో చోరీ జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు అణువణువు పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో లాలాపేట పోలీసులకు పాతగుంటూరు కోడిగుడ్డు సత్రం సమీపంలో రహదారిపై నిందితుడు చొక్కాలోపల విగ్రహాలను పెట్టుకుని తీసుకెళుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. వెంటనే ఈ విషయాన్ని ఎస్పీ, డీఎస్పీలకు తెలియజేయటంతో వారంతా లాలాపేటలోని డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. చోరీకి పాల్పడిన పాతగుంటూరు కట్టావారి వీధికి చెందిన పోలిశెట్టి దుర్గారావు(దుర్గ)గా గుర్తించారు. ఈ యువకుడు 13 ఏళ్ల ప్రాయంలోనే సైకిల్ చోరీ చేసినట్లు 2010లో పాతగుంటూరు పోలీసులు బాలనేరస్థుడిగా కేసు నమోదు చేశారు. తండ్రి చనిపోవటం కుటుంబ పోషణ నిమిత్తం తల్లి బయటకు వెళ్లటంతో ఈ యువకుడు నేరాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. షాపులు, ఇళ్ల ముందు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పట్టుకుపోతూ ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది. చోరీకి గురైన కుసుమహరనాథ విగ్రహాలు రెండూ కూడా ఇత్తడివి కావటంతో వాటి విలువ సుమారు రూ.10వేలు ఉంటుందన్నారు. గుడిలో పూజారి సతీమణి పూజా కార్యక్రమాల్లో ఉండగానే వాటిని పట్టుకెళ్తున్నట్లు చూసి కేకలు వేయగా నిందితుడు దుర్గ విగ్రహాలతో పరారయ్యాడని, మద్యం తాగి ఉండడంతో ఎవరూ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. లేకపోతే గుడి పరిసరాల్లోనే చిక్కేవాడని పోలీసులు తెలిపారు.