
తాజా వార్తలు
మెట్రో బండి.. మొండికేస్తోందండి
తరచూ నిలిచిపోతున్న రైళ్లు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్ మహా నగరానికే తలమానికమైన మెట్రో రైలు వ్యవస్థ ఇప్పుడు దైవాదీనం సర్వీసుగా మారిపోయింది. ఏ స్టేషన్లలో ఎప్పుడు ఆగిపోతుందో... ఎంత సేపటికి తిరిగి కదులుతుందో చెప్పలేని పరిస్థితి.
మెట్రో రైలు పరుగు ప్రారంభించాక 2018లో 2సార్లు సాంకేతిక ఇబ్బందులతో ఆగింది. ఆ తరువాత ఏడాది నుంచి రైలు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2019లో 6సార్లు, 2020లో 5సార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కొద్ది రోజుల కిందట జూబ్లీహిల్స్- చెక్‌పోస్టు మధ్య మెట్రో రైలు అరగంట ఆగిపోయింది. తరువాత మియాపూర్- ఎల్బీనగర్ మధ్య ఓసారి, నాగోలు- రాయదుర్గం మధ్య ఓ అరగంట మొరాయించింది. మంగళవారం సాయంత్రం గాంధీభవన్ స్టేషన్లో అరగంట మొండికేసింది. రైలు నిల్చిపోతే ఆ ప్రభావం మొత్తం కారిడార్‌పై పడుతోంది.
కరోనా దెబ్బతో కుదేల్!
కరోనా వల్ల కొన్ని నెలలు రైళ్లు నడపకపోవడంతో ఎల్అండ్టీ మెట్రో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అప్పు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాకు ముందు సగటున రోజుకు 5 లక్షలమంది ప్రయాణిస్తే సర్వీసులు మొదలయ్యాక ఇప్పుడిప్పుడే 2 లక్షలకు చేరింది. దీనికి అనుబంధంగా ఉన్న మాల్స్‌లోనూ వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
మరోవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. మెట్రో నిర్మాణం అనుకున్న సమయం కంటే రెండేళ్లు ఆలస్యం కావడంతో రూ.2 వేల కోట్ల భారం పడిందని ఎల్అండ్టీ మెట్రో చెబుతోంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలంటూ ఎల్అండ్టీ అధికారులు పలుమార్లు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విషయంలో ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు.
అంతంతే సదుపాయాలు
మెట్రో స్టేషన్ల పైన, కింద పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.200 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. నిధులు మొత్తం ఖర్చైనా మూడొంతుల స్టేషన్లలో పూర్తిస్థాయి సదుపాయలే లేవు. నాగోలు మెట్రో స్టేషన్ దగ్గర 142 ఎకరాలు ఇస్తే ఇందులో వంద ఎకరాలను ప్లాట్లగా విక్రయించి, వచ్చే నిధులతో ఆర్థిక కష్టాలు అధిమించాలని అధికారులు భావిస్తున్నారు.