
తాజా వార్తలు
ప్రపంచ ప్రఖ్యాత నవల మూన్‌స్టోన్ విశేషాలు..
పసుపు పచ్చ రంగులో కాంతులు విరజిమ్మే చంద్రకాంతమణి (మూన్‌స్టోన్) ధర ఇరవైవేల బ్రిటిష్ పౌండ్లు ఉంటుందని అంచనా వేశారు వ్యాపారులు. ఒకప్పుడిది ఇండియాలోని సోమనాథ్ దేవాలయంలో చంద్రుడిని అలంకరించింది. ఇప్పుడు ఒక ఇంగ్లిష్ యువతికి పద్దెనిమిదో పుట్టినరోజు కానుకగా మారింది. ఆమె పేరు మిస్ రాచెల్ వెరిందర్. అయితే తనమీది ప్రేమతో కాకుండా, కేవలం ప్రతీకారం తీర్చుకోవటానికే దీన్నిచ్చారని ఆమెకు తెలీదు. చిల్లర తిరుగుళ్లు తిరిగి, పలు నేరాలు చేసిన ఆమె అంకుల్ జాన్హెర్న్ హత్యలు, దొంగతనం చేసి ఈ మూన్‌స్టోన్‌ను సంపాదించాడు. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు శాపగ్రస్తుల్లా బలి కావాల్సిందే. ప్రాణాపాయమూ సంభవించవచ్చు. రాచెల్ తల్లి జూలియా అనేక సంవత్సరాల క్రితం అతడిని అవమానించినందుకు ప్రతీకారంగా ఇప్పుడామె కూతురికి దీన్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే ముంచుకొస్తున్న ప్రమాదం గురించి రాచెల్, తల్లి జూలియా, ఆమె కజిన్, కాబోయే భర్త ఫ్రాంక్లిన్ బ్లేక్, ఇంటి నౌకరు గేబ్రియల్ బెటరెడ్జ్ ముందే పసిగట్టారు. రాచెల్‌కు మాత్రం, తన అంకుల్ దుష్టబుద్ధి గురించి తెలీదు.
వంశపారంపర్యంగా సోమనాథ్ దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారులు చంద్రకాంతమణిని అనుసరిస్తూ ఇంగ్లండ్‌కి వచ్చారనీ, ఎన్ని ప్రయత్నాలైనా చేసి దాన్ని తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని నిశ్చయించు కున్నారనీ వాళ్లకి తెలుసు.
తమ ప్రాసాదానికి సమీపంలో కొందరు ఇండియన్ వీధి గారడీ వాళ్లను చూసినప్పుడు వాళ్ల అనుమానం మరింత బలపడింది. రాచెల్ పుట్టినరోజు డిన్నర్ సమయానికి ఇంటి వాతావరణం గంభీరంగా తయారైంది. ఏదో ప్రమాదం పొంచివున్నదనే అనుకున్నారందరూ..