close

తాజా వార్తలు

Updated : 25/02/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అట్టుడికిన నరసరావుపేట

డిగ్రీ విద్యార్థిని హత్యతో పట్టణంలో ఉద్రిక్తత

నరసరావుపేటలోని పల్నాడులో రోడ్డులో ధర్నా చేస్తున్న విద్యార్థులు 

నరసరావుపేట పట్టణం,  నరసరావుపేట లీగల్, న్యూస్‌టుడే  : నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషను దారుణంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, పలు సంఘాలకు చెందిన నేతలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంతో నరసరావుపేటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థిని అనూష హత్యకు గురైనట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహం చూసి భోరున విలపించారు. తమ కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడని, గుండెలలిసేలా తల్లిదండ్రులు విలపించారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనూష హత్యకు గురైన విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు ఎవరూ స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తూ మార్చురీ దగ్గర ఉన్న అనూష మృతదేహాన్ని తీసుకుని  రోడ్డుపైకి వచ్చారు. ఈక్రమంలో పట్టణంలోని ప్రధాన రహదారికి  మృతదేహంతో ప్రదర్శనగా వచ్చారు. పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా అందుకు వారు అంగీకరించలేదు. యాజమాన్యం వైఖరికి నిరసనగా కళాశాల భవనాలపై దాడికి దిగి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. పట్టణంలో మాయూరి లాడ్జి సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ఓ దశలో సబ్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. 

నేతల రాకతో మరోమారు ఉద్రిక్తత
విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలుసుకుని తెదేపా నేతలు జీవీ ఆంజనేయలు, డాక్టరు అరవిందబాబు, కోడెల శివరాం, సీపీఐ నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్‌ చేశారు. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థులు, నేతలు నిరసన కొనసాగించారు. సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజయ్‌కుమార్‌ మృతురాలి బంధువులతో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు సాగించారు.

ఆశలు చిదిమేసిన ప్రేమాకర్షణ
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, ముప్పాళ్ల, వినుకొండ : అమ్మాయిని ఉన్నత చదువులు చదివించాలని తలచారు.... సాధారణ కుటుంబమే అయినా పిల్లలు తమలా కష్టపడకూడదనే ఆశయంతో కళాశాలకు పంపారు. పిల్లల చదువులే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని నమ్మారు. ఉదయం కళాశాలకు వెళ్లిన కూతురును హతమార్చారన్న సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కన్న కూతురు ఇక లేదన్న నిజం అంతులేని ఆవేదన మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న అనూష విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన దృశ్యాలు అందరికీ కన్నీరు తెప్పించాయి. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండటంతో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూసి గ్రామం మొత్తం నరసరావుపేటకు తరలివచ్చింది. బాధితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలో పాలుపంచుకొంది. 
నీ ముప్పాళ్ల మండలంలోని గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట ప్రభాకరరావు, వనజ దంపతులది రైతు కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. వారికి వేణు, అనూష సంతానం. వేణు ఇంజినీరింగ్‌ చదువుతుండగా అనూష డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పిల్లలిద్దరికీ ఉన్నత చదువులు చెప్పించేందుకు వారిద్దరూ ఎంతో కష్టపడ్డారు. చదువుతోనే జీవితంలో ఉన్నతస్థితికి చేరవచ్చని ప్రతిదశలోనూ పిల్లల్లో ఆత్మస్ఘైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. రెండో సంతానం అనూష అంటే కుటుంబమంతటికి ఎంతో ఇష్టం. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేయాలనుకున్నారు. బుధవారం ఉదయం పుస్తకాలు చేతపట్టి అమ్మానాన్న.. కళాశాలకు వెళ్తొస్తా.. అంటూ బయలుదేరిన కుమార్తె హత్యకు గురైందని తెలిసి ప్రభాకర్, వనజ కుప్పకూలిపోయారు. దేవుడా మాకే ఎందుకిలా జరిగిందంటూ వారు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. వివాదరహితంగా అందరితో కలివిడిగా ఉండే కుటుంబంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గ్రామంలోనూ విషాదం నింపింది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి ఆకర్షణ  వలలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటుందని ఊహించలేకపోయారు. కళాశాల చదువులో చిగురించిన ఆకర్షణ.. పరిపక్వతలేని ప్రేమ విద్యార్థుల ఆశల్నే కాదు వారిపై నమ్మకం పెట్టుకున్న వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  

ప్రయోజకుడవుతాడని కళాశాలకు పంపితే... 
అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్‌రెడ్డిది బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామం. తల్లిదండ్రులు మేడం కోటిరెడ్డి, రమాదేవిలది రైతు కుటుంబం. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త కాగా, తండ్రి వ్యవసాయం చేస్తున్నారు. గ్రామంలో వివాదరహిత కుటుంబంగా పేరుంది. తమ వలె తమ పిల్లలు కష్టపడకూడదని చదువుకుని ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో కళాశాలకు పంపారు. చదువుకుని పేరు తెస్తారకున్న కుమారుడు హత్య చేశాడన్న వార్తతో ఆ కుటుంబం ఆందోళనకు లోనైంది. 

క్షణక్షణం..ఉత్కంఠ

ఉదయం 10 గంటలు  
అనూషను చంపినట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్‌కొచ్చి చెప్పిన నిందితుడు విష్ణువర్ధన్‌రెడ్డి 

10:30 
గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు.

11:30

పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు మృతదేహం తరలింపు

12:00 
మృతి విషయం తెలుసుకున్న పలు కళాశాలల విద్యార్థులు ఏరియా వైద్యశాలకు భారీగా రాక 

మధ్యాహ్నం 1 గంట
యువతి మృతదేహాన్ని స్ట్రెక్చర్‌పై తీసువెళ్లి పల్నాడు రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా

2:30

కొంతమంది విద్యార్థులు అనూష విద్యనభ్యసించే కళాశాలకు చేరుకొని ఆందోళన, ఫర్నిచర్‌ ధ్వంసం 
3:00

కళాశాల వద్ద విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..స్టేషన్‌కి తీసుకెళ్లిన అనంతరం వదిలిపెట్టారు. 

3:30

తెదేపా, సీపీఐ, ఏఐవైఎఫ్‌ నేతలు ధర్నా ప్రాంతానికి చేరుకొని మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌.

సాయంత్రం 5
సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజయ్‌కుమార్, తహశీల్దార్‌ రమణనాయక్‌ ధర్నా ప్రాంతానికి చేరుకొని మృతురాలి బంధువులతో చర్చలు

5:30

పీఎన్‌సీ తదితర కళాశాలల విద్యార్థులు ధర్నా ప్రాంతానికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం  

రాత్రి 7.30  
యువతిని హత్య చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని కొవ్వొత్తులతో విద్యార్థులు నిరసన 

7:40 
నిరసనలో పాల్గొన్న తెదేపా జిల్లా అధ్యక్షుడు జి.వి ఆంజనేయులు, డాక్టర్‌ అరవిందబాబు, కోడెల శివరాం 

8:00 
సబ్‌ కలెక్టర్‌ మరోమారు చర్చించి మృతురాలి బంధువుల డిమాండ్లు జిల్లా కలెక్టర్‌కు నివేదన  

9:40 
ప్రభుత్వం తరఫున పరిహారం అందిస్తామని ప్రకటించడంతో ఆందోళన విరమణ, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం  ఆసుపత్రికి తరలింపు. 

నరసరావుపేట: మృతదేహం వద్ద రోదిస్తున్న అనూష తల్లిదండ్రులు

కాలువ నుంచి బయటకు తెస్తున్న అనూష మృతదేహం 

మృతదేహం వద్ద బైఠాయించిన తెదేపా నేతలు జీవీ ఆంజనేయలు, అరవిందబాబుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని