
తాజా వార్తలు
గన్ కంటే ముందు జగన్ ఎక్కడ?

అనూష తల్లిదండ్రుల్ని పరామర్శిస్తున్న తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అనిత
గోళ్లపాడు(ముప్పాళ్ల), న్యూస్టుడే: ఆడబిడ్డలకు ఏమైనా జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారని అధికార పార్టీ ప్రచారం చేసిందని అనూషను దారుణంగా హతమార్చితే ఏ గన్నూ రాలేదని తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని అనూష తల్లిదండ్రులను ఆమె స్వగ్రామం ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలపై అమానుష ఘటనలు 350 నుంచి 400 వరకు జరిగినా సరైన చర్యలు లేవని ఆక్షేపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దిశ చట్టం అమలులోకి రాలేదన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకోవడం శోచనీయమని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమెకు మనసు రాలేదా అని ప్రశ్నించారు. ఏ ఆడబిడ్డకు మళ్లీ ఇలా జరగకుండా తెదేపా చూస్తుందని స్పష్టం చేశారు. అనూష హత్య కేసు నిందితుడికి బెయిల్ రాకుండా అడ్డుకుంటామని అతనికి ఉరి శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. తెదేపా అంగన్వాడీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బీమినేని వందనాదేవి, నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ మహిళా విభాగం బాధ్యులు దాసరి ఉదయశ్రీ, లీలావతి, అన్నాబత్తుని జయలక్ష్మి, ముంతాజ్బేగం, ఒంగోలు పార్లమెంట్ బాధ్యురాలు పావులూరి పద్మశ్రీ, కృష్ణా జిల్లా మహిళా విభాగం నాయకురాలు సునీత, స్థానిక నాయకులు పాపారావు, వెంకటరావు, మధు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.