close

తాజా వార్తలు

Updated : 02/03/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యక్తిగా గెలిచి.. చిరంజీవిగా నిలిచి..


వెంకటేశ్వర్లు దాచిన చిత్రం

నగరంపాలెం(గుంటూరు), పంగులూరు, న్యూస్‌టుడే: పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్న ఆయన.. పిల్లలు తనలా కాకూడదని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నత చదువులు చదివించారు. పిల్లలూ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కష్టాలన్నీ పోయి అంతా సంతోషంగా ఉన్నారనుకున్న తరుణంలో విధి చిన్నచూపు చూసింది. ఓ ప్రమాదం ఆయనను జీవన్మృతుడిని చేసింది. అవయవదానంతో.. మరో నలుగురికి ప్రాణాలు పోసిన ఆయన చిరంజీవిగా నిలిచారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరు గ్రామానికి చెందిన నూతలపాటి వెంకటేశ్వర్లు (56) స్థానికంగా పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. భార్య శేషమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు. పంక్చర్ల దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే పిల్లల్ని బాగా చదివించారు. కుమారుడు వెంకట్రామయ్య ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కుమార్తె రేవతి ఎంసీఏ పూర్తి చేశారు. ఇద్దరికీ వివాహాలు చేసి.. తండ్రిగా తన బాధ్యతలు నేరవేర్చుకున్నారు వెంకటేశ్వర్లు. కష్టాలన్నీ తొలగి అందరూ సంతోషంగా ఉన్నారనుకున్న తరుణంలో అనుకోని దుర్ఘటన ఎదురైంది. ఫిబ్రవరి 17న తన మిరప పంటకు నీరు పెడుతుండగా ఇంజిన్‌ టైరుకు పంక్చరైంది. పంక్చర్‌ వేసి గాలి పెడుతుండగా.. టైరు పేలి దానికి ఉన్న ఇనుప కమ్మి ఆయన తలకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని పీపుల్స్‌ ట్రామా కేర్‌ సెంటర్‌కు తీసుకువెళ్లారు. సర్జరీ విజయవంతం కావడంతో కోలుకున్నారు. శనివారం సాయంత్రం డిశ్ఛార్జి చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ రోజు మధ్యాహ్నం బెడ్‌పై పడుకున్న వెంకటేశ్వర్లు మళ్లీ లేవలేదు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు.


అవయవాలను అంబులెన్స్‌లోకి తరలిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు: ఆదివారం ఉదయం గుంటూరు రమేశ్‌ అసుపత్రికి తీసుకొచ్చారు. జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ సూచన మేరకు తండ్రి అవయవాల దానానికి పిల్లలు పెద్ద మనసుతో అంగీకరించారు. దీంతో గుంటూరులోని రమేష్‌ ఆసుపత్రి నుంచి సోమవారం ఆయన గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాలేయం, మూత్రపిండాలను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అవయవాలను చెన్నైకి తరలించే క్రమంలో గుంటూరు రమేశ్‌ ఆసుపత్రి నుంచి విజయవాడ మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేశారు. గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటుకు పోలీసు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని