
తాజా వార్తలు
భార్య ఒడిలోనే ప్రాణాలొదిలిన భర్త
● బస్సులో ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఘటన
● మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
కడప నేరవార్తలు, న్యూస్టుడే : వారం రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులో వృద్ధ దంపతులు వస్తుండగా మార్గమధ్యంలో భర్త చనిపోయాడు. డ్రైవరు, కండక్టరు వారిని మార్గమధ్యలోనే దించేశారు. ఈ ఘటన మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆర్టీసీ సిబ్బంది వెళ్లి క్షమాపణలు అడిగారు. ఇదే తరహా ఘటన జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. అయితే డ్రైవరు, కండక్టరు, ఆర్టీసీ విజిలెన్స్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే...మైదుకూరు మండలం వనిపెంట సమీప తిప్పిరెడ్డిపల్లెకు చెందిన ఎర్రన్న(80) సాలమ్మ భార్యాభర్తలు. ఈ వృద్ధ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఓ కుమారుడు చనిపోయాడు. మరో కుమారుడు, కుమార్తె వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరూ వేరుగా ఉంటున్నారు. ఎర్రన్న అనారోగ్యం బారిన పడినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎర్రన్న ఆస్తమాతో అస్వస్థతకు గురికావడంతో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు దంపతులు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. చెన్నూరు దాటిన అనంతరం భార్య ఒడిలోనే ఎర్రన్న ప్రాణాలు వదిలాడు. కడప ఆర్టీసీ బస్టాండుకు వచ్చిన తరువాత ఎవరూ స్పందించలేదు. వీరి విషయం తెలుసుకున్న ఆర్టీసీ భద్రత ఉద్యోగులు రవి, శివారెడ్డి వెంటనే బస్సు వద్దకు వెళ్లారు.‘మేము సైతం’ సంస్థకు సమాచారమిచ్చారు. వెంటనే వారు వచ్చి ఎర్రన్న మృతదేహాన్ని దివ్యదామ రథంపై తిప్పిరెడ్డిపల్లెకు తరలించారు.