కాటేదాన్, న్యూస్‌టుడే: వివాహ వేడుకల్లో కానుకలు మాయం చేసే ఓ ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, మైలార్దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు మన నగరంలోని రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి ఠాణాల పరిధిలో ఈ ముఠా మూడు ఘటనలకు పాల్పడింది. పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితురాలు.. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి కావడం గమనార్హం. గతనెల 7న మైలార్దేవుపల్లి ఠాణా పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుండగా ఓ మహిళ, ఎనిమిదేళ్ల చిన్నారి మరో ఇద్దరు వ్యక్తులు కారులో అక్కడికి చేరుకున్నారు. సొంత బంధువుల్లా ప్రవర్తించారు. ప్యాక్ చేసిన బాక్సులు, ఇతర పెళ్లి కానుకలు గుర్తించారు. ముఠాలోని చిన్నారి ఆడుతూ పాడుతూ ఈ గిఫ్ట్ బాక్సులు తస్కరించింది. ఆ బాక్సులను మూటగట్టుకుని వారంతా మాయమయ్యారు. ఖరీదైన బహుమతులు మాయమయ్యాయని స్థానిక మైలార్దేవుపల్లి పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన విందు వేడుకల్లో పాల్గొన్న ముఠా అదే విధంగా చోరీలకు పాల్పడింది. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులందాయి. శంషాబాద్ ఎస్ఓటీ, మైలార్దేవుపల్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేయగా నిందితులు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పిల్‌ప్లే రసోడా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రులను, మరో ఇద్దరిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.50 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వీరి ప్రత్యేకత..
ఈ ముఠా కొందరికి తాము దిల్లీకి చెందిన వారమని, మరికొందరికి ఇరాన్ నుంచి వచ్చి జీవిస్తున్నామని ప్రాంతాల వారిగా నమ్మించి మాయ చేస్తారు. దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో ఇదే తీరుగా చోరీలు చేస్తున్న ఈ ముఠాను.. మధ్యప్రదేశ్, దిల్లీ, ఇరాన్ పేర్లలోని మొదటి అక్షరాలను కూర్చి ఎమ్‌డీఐ గ్యాంగ్‌గా పోలీసులు నామకరణం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు చిన్నారి కావడంతో.. ఆమె తల్లి, మరో ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు.