
తాజా వార్తలు
బండిచ్చారో.. బుక్కవుతారు!
* డ్రైవింగ్ లైసెన్సు లేని కుమారుడికి బైకు ఇచ్చినందుకు తండ్రిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28న తండ్రి బైక్ తీసుకెళ్లిన తనయుడు ఒకరిని ఢీకొట్టి, అతని మృతికి కారణమయ్యాడు. బండి ఇచ్చిన తండ్రిపై ఐపీసీ 304, 109, ఎంవీ యాక్టు 180 ప్రకారం కేసులు నమోదు చేశారు.
* సూరారంలో ఓ వ్యక్తి బైక్‌పై తన తల్లిని తీసుకొస్తుండగా.. పడిపోవడంతో తల్లికి తలకు గాయమై ంది. చికిత్స పొందుతూ మృతి చెందింది. లైసెన్సు లేకుండా నడిపినందుకు ఆ యువకుడిపై కేసుపెట్టారు.
* నేపాల్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు బైక్‌పై వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందారు. లైసెన్సు లేకపోవడంతో వాళ్లకు బైక్ ఇచ్చిన తోటి కార్మికుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
* కేపీహెచ్‌బీ పరిధిలో ఓ యువతి ఒండి నడుపుతూ టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందింది. టిప్పర్ డ్రైవర్‌ను ఏ2గా, ఆమెకు బైక్ ఇచ్చిన యువకుణ్ని ఏ1గా పోలీసులు చేర్చారు. యువకుణ్ని జైలుకు పంపారు.
స్నేహితుడు వాహనం కొన్నాడనో.. ఇంట్లో గొడవ పెడుతున్నారనో.. లేదంటే మితిమీరిన గారాబంతోనో కొందరు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు కొనిపెడుతున్నారు. వారికి వాహనం నడిపే అర్హత ఉందా.. లేదా.. పరిశీలించడం లేదు. వారు ప్రమాదాలకు పాల్పడితే, వాహనం ఇచ్చిన వ్యక్తులు, తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇలా చేస్తే మంచిది.. 18 ఏళ్లు నిండి.. డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకోవాలి. మైనర్ల చేతికి బండ్లు ఇవ్వకపోవడం మంచిది. తెలియకుండా తీసుకెళ్లినా వెంటనే వెనక్కి రావాలని కోరాలి. పిల్లలకు బండ్ల తాళాలు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఎంవీ చట్టం, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. అవసరం లేకుండా బైక్‌లు కార్లు కొనివ్వొద్ధు
- ఈనాడు, హైదరాబాద్; న్యూస్‌టుడే, దుండిగల్