close

తాజా వార్తలు

Updated : 05/03/2021 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కనుపాపలు... కన్నీటి జ్ఞాపకమై...

గోదావరిలో ముగ్గురు యువకుల దుర్మరణంతో విషాదం

ముమ్మిడివరం, అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి శెట్టిపేటకు చెందిన దంగేటి ఫణికుమార్‌(19), కుడిపూడి ప్రేమ్‌సాగర్‌ (17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19) స్నేహితులు. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎవరికీ చెప్పకుండా ముగ్గురూ ద్విచక్ర వాహనంపై ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో ఉత్తరవాహిని పుష్కరాల రేవులో స్నానానికి వెళ్లారు. దుస్తులు, సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు ఒడ్డున ఉంచి రేవులో దిగిన వీరు మృత్యువాతపడ్డారు. లంక ప్రాంతం కావడంతో మధ్యాహ్నం నుంచి ఇక్కడ జన సంచారం ఉండదు. దీంతో విషయం బయటకు రాలేదు. యువకుల చరవాణులకు ఫోన్‌చేసి, రాతంత్రా ఎదురుచూసిన కుటుంబ సభ్యులు గురువారం అమలాపురం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఓ సెల్‌ఫోన్‌ను గేదెల్లంకలో పశువుల కాపరి చూశాడు. నదిలో మృతదేహం పైకి తేలడం గుర్తించాడు. ఈలోగా పోలీసులు సైతం చరవాణి సంకేతాలను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముమ్మిడివరం, అమలాపురం ఎస్సైలు కేవీ నాగార్జున, సి.హెచ్‌.రాజేష్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పేద కుటుంబాలపై పిడుగు 
దంగేటి కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి 
 దంపతులకు ఇద్దరు కుమారుల్లో రెండోవాడు ఫణికుమార్‌. ఇంజినీరింగ్‌ చదువుతూ మధ్యలో ఆపేశాడు. దివ్యాంగుడైన తండ్రి ఇంటింటికీ తిరుగుతూ దినపత్రికలు పంపిణీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఇంటికి దిక్కవుతాడనుకుంటే గోదారమ్మ తీసుకుపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మామిడిశెట్టి శ్రీనివాస్‌, పార్వతి దంపతులకు అమ్మాయి, అబ్బాయి. కుమారుడు బాలవెంకటరమణ డిప్లొమా చదివి ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ ఆటోడ్రైవర్‌గా జీవనోపాధి పొందుతుండగా.. పార్వతి కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో వారి ఆవేదన చూపరులను కలచివేసింది.

కుడిపూడి నాగమణేశ్వరరావు, సూర్యకుమారి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ప్రేమ్‌సాగర్‌ (17)ను దత్తత తీసుకున్నారు. ఈ విద్యార్థి డిప్లొమా చదువుతున్నాడు. తల్లి గతంలో క్యాన్సర్‌ బారినపడి మృతి చెందగా, తండ్రి నాగమణేశ్వరరావు ఇటీవలే కన్నుమూశారు. దీంతో ప్రేమ్‌కుమార్‌ చిన్నాన్న వద్ద ఉంటున్నాడు. కుటుంబంలో ముగ్గురూ ఇలా మృత్యు కౌగిలికి చేరడంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని