శిరస్త్రాణమే.. నిందితులను పట్టించింది! 
close

తాజా వార్తలు

Published : 15/05/2021 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శిరస్త్రాణమే.. నిందితులను పట్టించింది! 

తుపాకీ పేల్చడం అదే మొదటిసారి.. 

ఈనాడు, హైదరాబాద్‌: నేరం జరిగిన చోట (క్రైం సీన్‌) ఉన్న ప్రతి వస్తువు కీలకమే. అవే నిందితుల దగ్గరికి పోలీసులకు దారి చూపుతాయి. కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దోపిడీ కేసులోనూ అదే జరిగింది. ఘటనాస్థలిలో పడిఉన్న శిరస్త్రాణమే ఇద్దరు నిందితులను పట్టించింది. అది కాల్పులు జరిపిన దుండగుడిదేనంటూ ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. ఏటీఎం లోపలికెళ్లేందుకు యత్నించే క్రమంలో ప్రతిఘటించడంతో అది కింద పడినట్లు వివరించారు.  అప్రమత్తమైన పోలీసులు ఆ శిరస్త్రాణంపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. పాత నేరస్థుల వేలి ముద్రలతో పోల్చి చూశారు. 2018లో దుండిగల్‌ ఠాణా పరిధిలో జరిగిన ఓ కేసులో అరెస్టయిన నిందితుడి వేలిముద్రలతో సరిపోయాయి. ఫోన్‌ నంబర్‌ సేకరించి టవర్‌ లొకేషన్‌ ఆధారంగా బిహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు అజీత్‌కుమార్‌(23)ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది. 

జీడిమెట్లలో విజయవంతం కావడంతోనే.. తుపాకీని చూపించి బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారని అజీత్‌కుమార్‌ భావించాడు. అందుకోసం తన అన్న సాయంతో బిహార్‌ నుంచి నాటు తుపాకీని తెప్పించాడు. గతనెల 16న జీడిమెట్లలో తన ప్రణాళిక విజయవంతమయ్యింది. ఒకేసారి రూ.1.95 లక్షలు వచ్చాయి. ఈ తరహాలోనే గత నెల 29న కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దగ్గర కూడా సిబ్బందిని బెదిరించి దోపిడికి పాల్పడాలని భావించాడు. తీరా  సిబ్బంది ప్రతిఘటించడంతో భయపెట్టేందుకే కాల్పులు జరిపినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. సెక్యూరిటీ గార్డును చంపాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా అజీత్‌కుమార్‌కు తుపాకీని వినియోగించడంలో నైపుణ్యం లేదు. అందుకే కాల్పులు జరిపినప్పుడు తుపాకీ నుంచి మ్యాగ్జిన్‌ ఊడిపోయిందని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఒకరు గాయపడగా, ఒకరు చనిపోయారు. 

నేను చెప్పినట్లు చేస్తే.. మరో నిందితుడు ముఖేష్‌ కుమార్‌(21) విద్యార్థి. ఇద్దరిదీ ఒక్కటే ఊరు. ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ముఖేష్‌కుమార్‌ తరచూ అజీత్‌కుమార్‌ దగ్గర వాపోయేవాడు. నేను చెప్పినట్లు చేస్తే నీ సమస్యలన్నీ తీరుతాయంటూ కొన్ని రోజుల కిందట అజీత్‌కుమార్‌ అతనికి ఫోన్‌ చేశాడు. తన అన్నయ్య ఇచ్చే తుపాకీని తీసుకుని హైదరాబాద్‌కు రావాలని సూచించాడు. ముఖేష్‌కుమార్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. అయినా.. పోలీసులకు చిక్కకుండా చాలా పక్కాగా వ్యవహరించాడు. ఘటన తర్వాత పల్సర్‌ 220సీసీ బైక్‌ను మేడ్చల్‌ రాయిలాపూర్‌లో శిథిలావస్థకు చేరిన వ్యవసాయ కొట్టంలో ఉంచారు. అది కొంచెం లోపల ఉండటం.. పైగా అటువైపు ఎవరూ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బండి గురించి బయటకు తెలియలేదు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని