
తాజా వార్తలు
కరోనా ఎఫెక్ట్: భారత్ మరో కీలక నిర్ణయం
దిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను సందర్శించిన విదేశీయులు, చైనా దేశస్థులకు జవనరి 15 తర్వాత భారత్ జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు చైనాలో భారత రాయబార కార్యాలయం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
‘చైనా పౌరులు, గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన ఇతర దేశాల పర్యాటకులు భారత్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వీసాలను ఉపయోగించుకోవచ్చా అని పర్యాటకుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆ వీసాలు ఇకపై పనిచేయవు. ప్రస్తుతమున్న వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వీరంతా భారత వీసాల కోసం కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. సాధారణ లేదా ఇ-వీసా ద్వారా జవనరి 15 తర్వాత చైనా నుంచి భారత్‌కు వెళ్లిన చైనా దేశీయులు లేదా ఇతర దేశాల పర్యాటకులు వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ హాట్‌లైన్ నంబర్లను సంప్రదించండి’ అని భారత రాయబార కార్యాలయం వరుస ట్వీట్లలో పేర్కొంది.
ఇప్పటికే చైనా పర్యాటకులకు, ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే ఇతర దేశాల పర్యాటకులకు ఇ-వీసా సదుపాయాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర వీసాలను కూడా రద్దు చేసింది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు పైగా పాకింది. భారత్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. మరోవైపు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన భారతీయులను దిల్లీ సమీపంలోని వైద్య శిబిరంలో ఉంచారు.