క్షిపణి పరికరం ఇక్కడే ఉంచు.. నువ్వు వెళ్లు..!
close

తాజా వార్తలు

Published : 22/02/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్షిపణి పరికరం ఇక్కడే ఉంచు.. నువ్వు వెళ్లు..!

 చైనా ఓడను వదిలిపెట్టిన అధికారులు

ఇంటర్నెట్‌డెస్క్‌ : చైనా నుంచి పాక్‌కు తరలిస్తున్న క్షిపణి విడిభాగాన్ని డీఆర్‌డీవో పరిశీలించేందుకు సిద్ధమైంది. ఈ నెల మూడో తేదీన గుజరాత్‌లోని కాండ్లా రేవు సమీపంలో ‘డ కుయ్‌ యన్‌’ అనేపేరుతో ఉన్న వాణిజ్య నౌక నుంచి ఇండస్ట్రీయల్‌ ఆటోక్లేవ్‌ అనే అనుమానాస్పద పరికరాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. నిన్న రాత్రి అధికారులు ఓడకు సంబంధించిన గ్యారెంటీల నుంచి సంతకాలు తీసుకొన్న అనంతరం అది భారత్‌ వీడి కరాచీకి వెళ్లేందుకు అనుమతి లభించింది. రాత్రి 7.31కి ఇక్కడ బయల్దేరిన ఆ ఓడ శనివారం అర్ధరాత్రి సమయానికి పోర్టు ఖాసీమ్‌కు చేరుకొందని భావిస్తున్నారు.  మరోపక్క స్వాధీనం చేసుకొన్న పరికరాన్ని నేటి నుంచి డీఆర్‌డీవో ప్రత్యేక బృందం పరిశీలించనుంది. 

జనవరి 17 చైనాలోని జియాంగ్‌యాన్‌ పోర్టునుంచి ఈ నౌక బయల్దేరింది.  ఇండస్ట్రీయల్‌ ఆటోక్లేవ్‌ను పరిశ్రమల అవసరాల నిమిత్తం తీసుకెళుతున్నట్లు నౌక సిబ్బంది చెబుతున్నా.. క్షిపణుల్లో వినియోగిస్తారనే అనుమానంతో భారత అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. వాస్తవానికి దీనిని రెండు రకాలుగా వినియోగిస్తారు.  ఆరెంజ్‌ రంగులో ఉన్న ఈ పరికరంలోని క్లిష్టమైన విభాగాలను క్షుణ్ణంగా తెలుసుకొనే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరికరాన్ని గత వారమే నౌక నుంచి ఒడ్డుకు చేర్చారు. గురువారం వరకు ఈఘటనపై ఎటువంటి పోలీస్‌ కేసు నమోదు చేయలేదు. వీటిని సరఫరా చేయడం ఐరాస ఒప్పందానికి కూడా విరుద్ధమే. వాస్తవానికి చైనా క్షిపణి కార్యక్రమానికి, పాక్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరికరం తెలియజేస్తోంది. పాక్‌ క్షిపణి సాంకేతికత ఉత్తరకొరియా, చైనాల నుంచి వచ్చిందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.

ఘటన జరిగింది ఇలా..

* జనవరి 17వ తేదీన వాణిజ్య నౌక డ కుయ్‌ ఉన్‌ చైనాలోని జింగ్‌యాన్‌ పోర్టు నుంచి కరాచీలోని పోర్ట్‌ ఖసీంకు రవాణా అయింది.  ఈ ఓడ ఐదు రోజులపాటు షాంఘైలో ఉంది.

* ఫిబ్రవరి 3వ తేదీన కాండ్ల ఓడరేవుకు చేరుకొంది.

* ఈ ఓడకు ఎటువంటి బకాయిలు లేవని కాండ్లా అధికారులు నో అబ్జెక్షన్‌ పత్రం ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీతో ఆన్‌వర్డ్స్‌ సెయిలింగ్‌ మెమో ఇచ్చారు.

* ఫిబ్రవరి5న అధికారులు దీనికి తుది క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో అధికారులకు దీనిలోని పరికరంపై నమ్మకమైన సమాచారం అందింది.

* ఆటోక్లేవ్‌ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు షిప్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఆటోక్లేవ్‌ మిసైల్‌లో డ్రైయర్‌గా వాడతారని పేర్కొన్నారు.

* ఈ పరికరాన్ని ఇస్లామాబాద్‌లోని యునైటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ దిగుమతి చేసుకొంటున్నట్లు గుర్తించారు. ఈ కన్సైన్‌మెంట్‌ను హాంగ్‌కాంగ్‌లోని జనరల్ టెక్నాలజీస్‌ బుక్‌ చేసుకొన్నట్లు తేలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని