‘ఆ దాడితో ముష్కరులకు ముచ్చెమటలు’
close

తాజా వార్తలు

Updated : 26/02/2020 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆ దాడితో ముష్కరులకు ముచ్చెమటలు’

వాయుసేన మాజీ అధిపతి బీఎస్‌ ధనోవా

దిల్లీ: బాలాకోట్‌ దాడితో ఉగ్రవాదులు భయపడ్డారని, అందుకే ఆ దాడి తర్వాత భారత్‌లో ఎలాంటి పెద్ద ఉగ్రఘటనలు చోటుచేసుకోలేదని వాయుసేన మాజీ అధిపతి బీఎస్‌ ధనోవా అన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపి సరిగ్గా నేటికి ఏడాది. ఈ సందర్భంగా ధనోవా నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. 

‘ఏడాది గడిచింది. ఇప్పుడు మేం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. బాలాకోట్‌ ఆపరేషన్‌ నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మేం చేపట్టే ఆపరేషన్లలో ఇది కీలకమైన మార్పు. పాక్‌ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరుపుతామని ఆ దేశం ఎన్నడూ ఊహించి కూడా ఉండదు. కానీ మేం దాన్ని విజయవంతంగా పూర్తిచేశాం. గతేడాది మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా బాలాకోట్‌ దాడి నిరోధకంగా పనిచేసింది. వైమానిక దాడులతో ముష్కరులకు ముచ్చెమటలు పట్టాయి. మళ్లీ ఉగ్ర ఘటనలు జరిగితే మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుందనే విషయం ఉగ్రవాదులకు అర్థమైంది. అందుకే బాలాకోట్‌ దాడి తర్వాత దేశంలో ఎలాంటి పెద్ద ఉగ్ర ఘటనలు చోటుచేసుకోలేదు. ఈ దాడితో ముష్కరులకు మేం ఒకే హెచ్చరిక ఇవ్వాలనుకున్నాం. ‘మీరు ఎక్కడున్నా సరే మేం చొచ్చుకుని వచ్చి మరీ మట్టుబెడతాం’ అని హెచ్చరించడానికి బాలాకోట్‌ దాడి చేపట్టాం’ అని ధనోవా చెప్పుకొచ్చారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను జైషే ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్‌.. పాక్‌ సహా ప్రపంచదేశాలకు గట్టి సందేశమిచ్చింది. 

కాగా.. బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు పాక్.. భారత్‌పై ప్రతిదాడికి దిగింది. భారత గగనతలంలోకి యుద్ధ విమానాలతో దూసుకొచ్చి దాడి చేసింది. అయితే పాక్‌ చర్యను భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మన మిగ్‌ విమానం ఒకటి కూలి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రుచెరలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని