భారత్‌లో కరోనా@206
close

తాజా వార్తలు

Updated : 20/03/2020 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా@206

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తూ తాజాగా 20 రాష్ట్రాలకు విస్తరించింది. దీనిని కట్టడిచేసేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19 కారణంగా నలుగురు మరణించిన విషయం తెలిసిందే. కేవలం గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో ఈ వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 206కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. మార్చి 20వ తేదీ నాటికి 12,486 వ్యక్తుల నుంచి 14,376 శాంపిల్స్‌ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. కరోనా లక్షణాలు ఉన్నవారితో పాటు, కొవిడ్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారి నుంచి ఈ శాంపిల్స్‌ సేకరించామని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 47కేసులు నమోదుకాగా కేరళలో 28మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. తాజాగా ఒడిశాలో మరో కొత్త కేసు నమోదు అయినట్లు ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 16 కేసులు నమోదుకాగా వీరిలో తొమ్మిదిమంది విదేశీయులే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. దీనిలో భాగంగా 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటికే పరిమితమవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఈ ‘జనతా కర్ఫ్యూ’ ద్వారా దేశ ప్రజల సంకల్పబలం నిరూపిద్దామని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. 

ఇదిలాఉంటే, అమెరికాలో కొవిడ్‌-19 తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న దేశాల్లో అమెరికా ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికారణంగా అమెరికాలో 200మంది మరణించగా మరో 14వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని అన్నిరాష్ట్రాలకు ఈ వైరస్‌ విస్తరించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని 4కోట్ల జనాభా కలిగిన కాలిఫోర్నియా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని