కరోనా ఎఫెక్ట్‌: వారికి రూ.1000 సాయం
close

తాజా వార్తలు

Published : 21/03/2020 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌: వారికి రూ.1000 సాయం

లఖ్‌నవూ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజు కూలీలకు ఉపాధి లేకుండా పోతోంది. అనేక చోట్ల థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, సహా జనసమర్థం ఉన్న ప్రాంతాలను మూసివేస్తుండటంతో వాటిపై ఆధారపడి పనిచేసే రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల యూపీలోని సుమారు 15 లక్షల రోజువారీ కూలీలకు, 20.37 లక్షల గృహనిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందచేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. కొవిడ్‌-19 నివారణకు రాష్ట్రంలో అమలుచేస్తున్న మూసివేత వలన ఉపాధి కోల్పోయే శ్రామికుల సహాయార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.

ప్రజలందరూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 9 వరకు ‘జనతా కర్ఫ్యూ’కు కట్టుబడి ఉండాలని ఆదిత్యనాథ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని మెట్రో రైళ్లు, ప్రభుత్వ బస్సు సర్వీసులు ఆదివారం పనిచేయవని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ గురించి ఆందోళనకు గురికానవసరం లేదని యూపీ ముఖ్యమంత్రి అన్నారు. వస్తువుల కొనుగోలుకు దుకాణాల వద్దకు పరుగులు తీయనవసరం లేదని... రాష్ట్రంలో సరిపడా అత్యవసర వస్తువులు, ఔషధాల నిల్వలు ఉన్నాయని యోగి వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అవసరమైన ఐసొలేషన్‌ వార్డు సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికి 23 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వారిలో తొమ్మిది మంది కోలుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా కేసులు నమోదు కాగా ఐదు కరోనా మరణాలు సంభవించాయి. కరోనా సోకిన వారిలో 39 మంది విదేశీయులు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని