
తాజా వార్తలు
అమెరికన్ల చూపు.. యోగా వైపు
లాక్డౌన్ వేళ ఆన్లైన్ తరగతులకు విశేష స్పందన
వాషింగ్టన్: కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు తమ మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో మార్చి 30 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ యోగా తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టం చేసినట్లు.. ఈ క్లిష్ట సమయంలో యోగాభ్యాసం అనేది ప్రజలను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతుంది’ అని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ వివరించారు. యోగా ఆన్లైన్ తరగతులకు అమెరికా వాసుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ జోష్వా గోర్డన్ సైతం ధ్యానం, యోగా, శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేయాలని స్థానికులకు సూచిస్తున్నారు. గతంలోనూ అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు, వైద్యులు యోగాభ్యాసాన్ని ప్రోత్సహించారు.