చచ్చినా, బతికినా..గౌరవం మాత్రం లేదు
close

తాజా వార్తలు

Published : 20/05/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చచ్చినా, బతికినా..గౌరవం మాత్రం లేదు

శవాలు, గాయపడిన వ్యక్తులు ఒకే ట్రక్కులో..

లఖ్‌నవూ: లాక్‌డౌన్ కారణంగా వలసకూలీలు పడుతున్న కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇళ్లకు చేరుకొనే క్రమంలో వారికి ఎదురవుతున్న ప్రమాదాలు మృత్యుఒడికి చేర్చుతున్నాయి. చివరికి మృత దేహాల తరలింపులో అధికారుల నిర్లక్ష్య వైఖరి విమర్శలకు దారితీసింది.ఉత్తర్‌ప్రదేశ్‌లో ట్రక్‌లో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించినవారి మృతదేహాలతో కలిపి గాయపడిన వ్యక్తులను పంపుతున్నట్లు ఉన్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.  మృత దేహాలను టార్పాలిన్ సంచుల్లో చుట్టి ఉంచినట్లు, వారి పక్కనే గాయాలతో ఉన్న కూలీలు కూర్చున్నట్లు ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. యూపీలోని ఔరయ వద్ద శనివారం ఆ రోడ్డు ప్రమాదం  జరిగింది. అయితే ఈ తరలింపు విధానంపై ఝార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘మా రాష్ట్రానికి చెందిన వలస కూలీలతో అంత క్రూరంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఝార్ఖండ్ సరిహద్దుల వరకైనా మృతదేహాలను తరలించడానికి సరైన రవాణా సౌకర్యం కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఆ తర్వాత మేం కూలీల మృతదేహాలను వారి సొంత పట్టణం బొకారోకు మర్యాదపూర్వకంగా తరలిస్తాం’ అని సోరెన్‌ యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. యూపీ రాజధాని లఖ్‌నవూకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరయ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో 26 మంది కూలీలు మరణించగా, 30 మంది గాయపడ్డారు. మరుసటి రోజు ఆ ఘటనలో మృతి చెందిన మృతదేహాలతో కలిపి, గాయపడిన ఇతర కూలీలను కూడా ఒకే ట్రక్‌లో తరలిస్తున్న చిత్రాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. చనిపోయిన వారిలో 11 మంది ఝార్ఖండ్‌కు చెందిన వారు కాగా, మిగిలిన వారు బెంగాల్ వాసులని అధికారులు తెలిపారు. అయితే సోరెన్ ట్వీట్‌తో అప్రమత్తమైన అధికారులు మృతదేహాలను అంబులెన్సులోకి మార్చారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఔరయా జిల్లా మేజిస్ట్రేట్ మీడియాకు తెలిపారు. 

లాక్‌డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయిన కూలీలు ట్రక్కులు, టెంపోలు, ఆటోలు, సైకిళ్ల మీద, చివరికి నడుచుకుంటూ కూడా తమ గ్రామాలకు చేరుకోవాలని ప్రయత్నిస్తూ, చివరికి ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటన్నింటిని గమనించిన యూపీ ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని