‘నమస్తే ట్రంప్‌’ వల్లే కరోనా వ్యాప్తి: రౌత్‌
close

తాజా వార్తలు

Published : 31/05/2020 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నమస్తే ట్రంప్‌’ వల్లే కరోనా వ్యాప్తి: రౌత్‌

ముంబయి: గుజరాత్‌ సహా ముంబయి, దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభించడానికి ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమమే కారణమని శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. అక్కడి నుంచి అధికారులు వివిధ ప్రాంతాలకు ప్రయాణించడంతో దేశమంతా కరోనా వ్యాపించిందన్నారు. అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండానే లాక్‌డౌన్‌ను విధించిన కేంద్రం.. ఆంక్షల్ని ఎత్తివేసే బాధ్యతను మాత్రం రాష్ట్రాలకు వదిలేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల్ని ఉద్దేశిస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష భాజపా ఎంతో పయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలో ఉన్న ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని.. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ విజృంభణ సాకుతో ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తే అది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని రౌత్‌ వ్యాఖ్యానించారు. మహమ్మారి కట్టడి చేయడమే రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రాతిపదిక అయితే.. దేశంలో 17 రాష్ట్రాల్లో విధించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర సైతం వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం అంతర్గత కలహాలతో దానికదే కూలిపోతుందన్న ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యల్ని రౌత్‌ ఖండించారు. అంతర్గతంగా విభేదాలున్నప్పటికీ.. గతంలో సేన-భాజపా కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించలేదా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రావడంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ కీలక పాత్ర పోషించారని.. కేవలం ఆయన మాత్రమే ప్రభుత్వ మనుగడపై అంచనా వేయగలరని రౌత్‌ వ్యాఖ్యానించారు. పవార్‌ సైతం ప్రభుత్వం కూలే అవకాశమే లేదని తేల్చి చెప్పడంతో సర్కార్‌కు ఉన్న ముప్పేమీ లేదని రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని