చైనా ఉత్పత్తులను బహిష్కరించాల్సిందే: సీఏఐటీ
close

తాజా వార్తలు

Published : 18/06/2020 21:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా ఉత్పత్తులను బహిష్కరించాల్సిందే: సీఏఐటీ

ప్రచారం ఆపివేయాలని సినీ ప్రముఖులు, క్రీడాకారులకు పిలుపు

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా మరోసారి ఊపందుకుంది. తాజాగా, చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది. ముఖ్యంగా చైనా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న బాలీవుడ్‌ నటులు, క్రీడాకారులు వెంటనే వాటి ప్రచారాన్ని ఆపివేయాలని విజ్ఞప్తి చేసింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చైనా ఉత్పత్తులను భారత్‌లో బహిష్కరణకోసం కృషిచేయాలని కోరుతూ సీఏఐటీ బహిరంగ లేఖ విడుదల చేసింది.

20మంది భారత సైనికుల ప్రాణాలను బలితీసుకున్న చైనాపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా చైనాను సైనికపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీయాలని లేఖలో పేర్కొంది. దీనిపై సీఏఐటీ ఆధ్వర్యంలోని ఏడు విభాగాల ద్వారా చైనా ఉత్పత్తులను నిషేధించేందుకు ‘బాయ్‌కట్‌ చైనీస్‌ గూడ్స్‌’పేరుతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ప్రకటించారు. దీనిలోభాగంగా, తొలుత బాలీవుడ్‌ సినీప్రముఖులు, క్రీడాకారులు తమతోకలిసి పోరాడాలని సూచించారు.

భారతీయ మార్కెట్‌లో చైనా ఉత్పత్తులను చొప్పించేందుకే ప్రముఖ సినీతారలతో చైనా కంపెనీలు భారీప్రచారం చేస్తున్నట్లు గ్రహించామని సీఏఐటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా అమీర్‌ఖాన్‌, విరాట్‌ కోహ్లీ, దీపికా పదుకొనే, కత్రినా ఖైఫ్‌, రన్‌భీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి సినీ ప్రముఖులు వివో, ఒప్పో, షియోమి, రియల్‌మి ఉత్పత్తులకు భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు వెంటనే చైనా ఉత్పత్తులపై ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతున్నట్లు సీఏఐటీ ప్రకటించింది.

ఇదిలాఉంటే, ఇప్పటికే 4జీ అప్‌గ్రేడ్‌ నిమిత్తం చైనా ఉపకరణాలను వినియోగించవద్దని బీఎస్‌ఎన్‌ఎల్‌ను కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆదేశించింది. అంతేకాకుండా చైనాతో సంబంధమున్న దాదాపు 52 మొబైల్‌ యాప్‌లను నిషేధించాలని నిఘా సంస్థలు కూడా భారత ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీనికి ఇప్పటికే జాతీయ భద్రతా మండలి కూడా ఆమోదం తెలిపింది. జూమ్‌, టిక్‌టాక్‌, యూసీబ్రౌజర్‌ వంటి చైనాకు చెందిన యాప్‌లు నిషేధిత జాబితాలో ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని