లెహ్‌లో ఎగిరిన యుద్ధ విమానం
close

తాజా వార్తలు

Published : 19/06/2020 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లెహ్‌లో ఎగిరిన యుద్ధ విమానం

సైన్యానికి సాయంగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరింపు

లెహ్‌, లద్దాఖ్‌లో భారత వాయుసేన అధినేత పర్యటన

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, చైనా మధ్య ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది! చైనీయుల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. సైన్యానికి తోడుగా భారతీయ వాయుసేన సైతం అత్యంత అప్రమత్తమైంది. కీలకమైన తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి తన ఆయుధ సంపత్తిని తరలించింది.

భారత అధీనంలోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక హెలికాప్టర్ల సంచారం సర్వ సాధారణమే. అయితే శుక్రవారం లెహ్‌ పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఐఏఎఫ్‌ చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా రెండు రోజుల పర్యటన కోసం లెహ్‌, శ్రీనగర్‌ వాయుసేన శిబిరాలకు రావడం గమనార్హం. చైనాతో వివాదం నేపథ్యంలో సరిహద్దుల్లోని వాయుసేన శిబిరాలు, ఎయిర్‌ఫీల్డ్స్‌కు తన సామగ్రిని తరలించింది.

‘వాయుసేన అధినేత రెండు రోజుల పర్యటనకు వచ్చారు. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వాయుసేన సన్నద్ధతను ఆయన పరిశీలించారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా 10వేల మందికి పైగా సైనికులను మోహరించిన సంగతి తెలిసిందే’ అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇదే విషయాన్ని ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి, వింగ్‌ కమాండర్‌ ఇంద్రనీల్‌ నందిని అడగ్గా ‘నో కామెంట్స్’ అనడం గమనార్హం.

భదౌరియా జూన్‌17న లెహ్‌లో పర్యటించారు. అక్కడి నుంచి జూన్‌18న శ్రీనగర్‌ వాయుసేన శిబిరానికి వెళ్లారు. ఈ రెండు శిబిరాలు తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో యుద్ధ విమానాల సేవలకు అనువుగా ఉంటాయి. అంతేకాకుండా చైనాపై ఆధిపత్యం చెలాయించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుందని అభిజ్ఞవర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా అతి తక్కువ సమయంలోనే ఎగిరేలా సుఖోయ్‌ 30ఎంకేఐ, మిరేజ్‌ 2000, జాగ్వార్‌ యుద్ధ విమానాలను ఐఏఎఫ్‌ ముందుకు తరలించింది. భారత సైన్యానికి సాయం అందించేందుకు దాడి సామర్థ్యమున్న అమెరికన్‌ అపాచీ హెలికాప్టర్లను సైతం మోహరించింది. లెహ్‌ శిబిరానికి సమీపంలో చినూక్‌ హెలికాప్టర్లనూ మోహరించడం గమనార్హం.

సైనికులకు అనుకూలంగా ఎంఐ-17వీ5 మీడియం లిఫ్ట్‌ ఛాపర్లను నియోగించింది. లద్దాఖ్‌, టిబెట్‌, అదమ్‌పుర్‌, హల్వారా, అంబాలా, సిర్సా శిబిరాల వద్ద ఐఏఎఫ్‌కు చైనాపై ఆధిపత్యం ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా భారత అధీనంలోని లద్దాఖ్‌ సమీప ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు ఎగిరేందుకు ప్రయత్నించడంతో హోతన్‌, గార్‌ గున్సా వద్ద 14,000 అడుగుల ఎత్తున భారత వాయుసేన ఎస్‌యు-30 యుద్ధ విమానాలను మోహరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని