
తాజా వార్తలు
2024 కల్లా ప్రతి భారతీయుడికీ కొవిడ్ టీకా
దిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా వైరస్ నిరోధక టీకా అందుతుందని పుణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వైద్యారోగ్య సిబ్బందికి, వృద్ధులకూ ఫిబ్రవరి 2021లోగా అందుతుందని.. ఇక ఏప్రిల్లో సాధారణ ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభమౌతుందని అన్నారు. కాగా, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే రెండు వ్యాక్సిన్ మోతాదులకుగాను సుమారు రూ.1000 ఖర్చుకాగలదని ఆయన అంచనా వేశారు.
పూర్తి దేశానికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందేందుకు కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని పూనావాలా వివరించారు. వ్యాక్సిన్ సరఫరా, పంపిణీల్లో గల పరిమితులు, బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఐదు నుంచి ఆరు డాలర్లు ఉండాల్సిన వ్యాక్సిన్ ధర, భారత ప్రభుత్వం భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నందున కేవలం మూడు నుంచి నాలుగు డాలర్లకు లభిస్తోందని పూనావాలా పేర్కొన్నారు. మార్కెట్లో ఉన్న అన్ని వ్యాక్సిన్ల కంటే తమ టీకా ధర తక్కువని ఆయన చెప్పారు.