close
Array ( ) 1

తాజా వార్తలు

అ‘మెరిక’పై...  ఎందుకీ మరక!

బలం ఉంది, బలగం ఉంది.. చీమ చిటుక్కుమన్నా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉంది.. శత్రువు ఎక్కడ దాక్కున్నా వెతికి హతమార్చే నైపుణ్యమూ ఉంది. అయినా సూక్ష్మాతిసూక్ష్మమైన వైరస్‌ చేతికి చిక్కి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది!
అంటువ్యాధులపై పోరుకు సంసిద్ధతలో ప్రపంచ ఆరోగ్య భద్రత సూచీ ప్రకారం 83.5 స్కోర్‌తో ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న అమెరికా అసలైన పరీక్షలో తప్పుతోంది... వేలాది మంది ప్రాణాల్ని పణంగా పెట్టింది!
తమ దేశంలో దాదాపు లక్ష మందికి మరణం ముప్పు పొంచి ఉందని ట్రంప్‌ సలహాదారులు అంచనా వేస్తుండడం గమనార్హం.

వైరస్‌ బలంపై అంచనా ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందేమోననే అతి జాగ్రత్త, ఎదుర్కోగలమనే అతి విశ్వాసం, ఉదాసీనత, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను తాను యుద్ధ సమయపు(కొవిడ్‌-19పై పోరు) అధ్యక్షుడిగా అభివర్ణించుకున్న ట్రంప్‌.. ప్రారంభంలో వాస్తవాల్ని, సైన్స్‌ని విస్మరించి దేశాన్ని యుద్ధరంగంలోకి లాగారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.

ఎందుకీ పరిస్థితి అంటే...
సంపన్న సమాజాలుగా, విజ్ఞాన తరంగాలుగా, భూతల స్వర్గాలుగా పేరొందిన అనేక దేశాలు కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ భారీగా ప్రభావం అవుతున్నాయి. అమెరికా అధికార వ్యవస్థలో అలసత్వం,  తొలి నాళ్లలో పరీక్షలకు అవసరమైన పరికరాల కొరత, ఫెడరల్‌ ప్రభుత్వానికి, రాష్ట్రాలకు మధ్య వైద్య, ఇతర అంశాల్లో అనుసంధానం కొరవడడం ప్రధాన సమస్యలుగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.
దక్షిణ కొరియాలో ప్రతి పది లక్షల మందిలో 8 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అమెరికాలో వారం క్రితం వరకూ ఈ సంఖ్య 3,300 మాత్రమే. కరోనాపై పోరులో ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు కావడంలేదు. పలు రాష్ట్రాల్లో ఇంకా లాక్‌డౌన్‌ అమలులో లేదు. జన సంచారం ఆగని ఫలితంగా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. వైరస్‌ ప్రభావం ఉన్న ఫ్లోరిడాలో వారô క్రితమే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలులో లేదు.


ఇప్పుడు వేగంగా దిద్దుబాటు చర్యలు

వైరస్‌ విజృంభించడం మొదలయ్యాక.. ట్రంప్‌ సర్కారు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతోపాటు విదేశాల నుంచి భారీగా మాస్క్‌లు, వెంటిలేటర్లు, ఔషధాలు, ఇతర సామగ్రిని తెప్పించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. 3వేల మంది సైనిక వైద్యులను న్యూయార్క్‌, ఇతర అత్యవసర ప్రాంతాలకు పంపింది. న్యూయార్క్‌లోని జేవిట్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ని అమెరికాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా సైనిక ఇంజినీర్లు మార్చేశారు. 18 రాష్ట్రాల్లో 22 తాత్కాలిక ఆసుపత్రులను నిర్మిస్తున్నారు. పరీక్షలను భారీగా పెంచారు. 1.17 కోట్ల ఎన్‌-95 మాస్కులు, 2.65 కోట్ల సర్జికల్‌ మాస్కులు, 23 లక్షల ముఖ కవచాలు, 44 లక్షల సర్జికల్‌ గౌన్లు, 2.26 కోట్ల చేతి తొడుగులను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. వివిధ దేశాల నుంచి 20 సైనిక విమానాల్లో వీటిని తెప్పించింది.


జనవరిలోనే తీవ్రత తెలిసినా...

డబ్ల్యూహెచ్‌ఓ తదితర సంస్థలు వైరస్‌ విస్తృతిపై తమను తప్పుదోవ పట్టించాయని తాజాగా ట్రంప్‌ ఆరోపిస్తున్నా.. ముందునుంచి నిపుణుల సూచనలను ఆయన పెడచెవిన పెట్టారన్న విమర్శలున్నాయి. జనవరి 21న వాషింగ్టన్‌ రాష్ట్రంలో తొలికేసు నిర్ధారణ అయింది. కరోనాకు కేంద్రమైన వుహాన్‌ను అదేనెల 23న చైనా లాక్‌డౌన్‌ చేసింది. తమ దేశంలో అంతా నియంత్రణలో ఉందని ఆ తర్వాత రోజు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికాలో తొలి కరోనా మృతి నమోదైంది. అది సామాజిక వ్యాప్తి కేసు కావడంతో ప్రమాదఘంటికను మోగించింది. ‘ఒక అద్భుతంలా కరోనా అంతమైపోతుంది’ అని ఆ రోజు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో చర్యలు చేపట్టకుంటే కొన్ని వారాల్లోనే 81% జనాభా ఈ వైరస్‌ బారిన పడొచ్చు. 22 లక్షల మంది చనిపోవచ్చు’ అని మార్చి 6న ‘ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌’ అంటువ్యాధుల నిపుణుల బృందం హెచ్చరించింది. అప్పుడూ వైరస్‌ విస్తృతిపై ప్రభుత్వం దగ్గర ఏ అంచనాలూ లేవని ట్రంప్‌ చెప్పారు.


సూచనలపైనా అభ్యంతరం

‘దేశవ్యాప్తంగా 10 మంది కంటే ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలి’ అని కరోనా వైరస్‌పై శ్వేతసౌధం కార్యదళం సమన్వయకర్త డా.డెబోరా బిర్‌క్స్‌ మార్చి 16న మీడియా సమావేశంలో సూచించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ట్రంప్‌.. అభ్యంతరం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో అసలు ఈ వైరస్సే లేదు కదా.. అని అడ్డుతగిలారు. ఆ తర్వాత రోజుకురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతుండడంతో.. అవసరమైన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు. ముందస్తు సన్నద్ధత లేకపోవడంతో అందరికీ పరీక్షలు అందుబాటులోకి రాలేదు.


అంటువ్యాధులపై ప్రత్యేక డైరెక్టరేట్‌ రద్దు

జాతీయ భద్రత కమిటీలో అంటువ్యాధులపై పోరుకు గత ప్రభుత్వంలో ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేశారు. 2018లో ట్రంప్‌ దానిని రద్దుచేశారు. ‘అంటువ్యాధుల్ని ఎదుర్కోవడానికి తొలినుంచి తీసుకోవాల్సిన ప్రతిచర్యని అందులో పొందుపరిచారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు’ అని నాటి అధికారులు చెబుతున్నారు.


‘అత్యవసర ఔషధ నిధి’ ఖాళీ

అమెరికాలో 1999లో ఏర్పాటు చేసిన ‘అత్యవసర ఔషధ నిధి’ ఖాళీ అయింది. దీని నుంచి రాష్ట్రాలకు మందులను సరఫరా చేయలేమని ఒకదశలో ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 13న దేశంలో కరోనా ‘ఎమర్జెన్సీ’ ప్రకటించిన ట్రంప్‌.. రాష్ట్రాలు తమ వైద్య అవసరాలకు సొంతంగా కొనుగోళ్లు చేసుకోవాలన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిధిని 2018లో ఆరోగ్య, మానవ సేవల విభాగానికి మార్చింది. ఈ మార్పుతో ఔషధ నిధి నిర్వహణ గాడి తప్పుతుందని అప్పుడే విమర్శలొచ్చాయి.


* కంటికి కనిపించని శత్రువు (కరోనా వైరస్‌) నుంచి మేము ఎంతో నేర్చుకుంటున్నాం. అది కఠినమైనది, చురుకైనది. కానీ మేము అంతకంటే కఠినమైన, చురుకైనవాళ్లం.

-ట్విట్టర్‌లో ట్రంప్‌ వ్యాఖ్య


* అమెరికాలో గత వందేళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య విపత్తుగా ఇది నిలవనుంది. ఎప్పుడు, ఎలా, ఎక్కడ కరోనా వైరస్‌ విస్తరిస్తుందో అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే ఇందుకు మూల కారణం.

-ఎరిక్‌ టోపోల్‌, మాలిక్యులర్‌ మెడిసిన్‌ ఆచార్యులు, అమెరికా


* ముప్పును అంచనావేసి త్యాగాలకు సిద్ధపడి, అప్రమత్తమైన దేశాల్లో నష్టం తక్కువ. ఈ విషయంలో అమెరికా  విఫలమైంది. ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థ ఉండొచ్చు. కరోనా వ్యాప్తికి అవకాశం కల్పిస్తూ 8వారాల సమయమిస్తే.. అది పూర్తిగా నాశనం చేసేస్తుంది.

-జెరిమి కోనిండిక్‌, గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం సభ్యుడు, అమెరికా


* వాతావరణ మార్పులపై శాస్త్రీయ ఆధారాలను గతంలో ట్రంప్‌ తోసిపుచ్చారు. కరోనా విషయంలోనూ సైన్స్‌ చెప్పే విషయాలను పట్టించుకోవడంలేదని తెలిసి ఎంతో బాధనిపించింది. ఇలాగే ఉంటే అసలు ఏ శాస్త్రాన్నైనా ట్రంప్‌ సీరియస్‌గా తీసుకుంటారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

-నవోమి ఒరెస్క్స్‌, హార్వార్డ్‌లో సైన్స్‌ చరిత్ర ఆచార్యులు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.