
తాజా వార్తలు
అబ్బాయిల టీమ్‌లో ఆడేసింది!
క్రికెట్ అంటే జంటిల్మేన్ గేమ్ మాత్రమే కాదు, అమ్మాయిల ఆట కూడా అని ఇప్పటికే చాలామంది నిరూపించారు. శరణ్యా సదారంగని...మరో అడుగు ముందుకేసి అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేసింది. ‘యురోపియన్ క్రికెట్ సిరీస్’లో ఆడిన మొదటి మహిళగా రికార్డునీ సృష్టించింది.
శరణ్యా సదారంగని.... క్రికెట్లో అరుదైన రికార్డు దక్కించుకుంది. డ్రీమ్ లెవెన్ ‘యురోపియన్ క్రికెట్ సిరీస్’లో ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు సాధించింది. ఐసీసీ గుర్తింపు ఉన్న ఈ లీగ్‌లో పురుషులతోపాటు మహిళా క్రికెటర్లూ ఆడేందుకు అనుమతి ఉంది. ఐరోపా దేశాలకు చెందిన జట్లు పాల్గొనే ఈ ‘టీ10 టోర్నీ’ తాజా ఎడిషన్ గత నెల చివర్లో మొదలైంది. దీన్లో జర్మనీకి చెందిన కేఎస్వీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది శరణ్య. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ‘పీఎస్వీ హన్ ముండెన్’ పై పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన శరణ్య... అయిదు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా రనౌట్ అయింది. కానీ వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించింది. బౌలర్లు ఎంతో వేగంగా బంతులు వేసినా వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ అందుకుని అందరినీ మెప్పించింది. ఓ కష్టసాధ్యమైన క్యాచ్‌ని పట్టింది కూడా. 24 ఏళ్ల శరణ్య... ఆరేళ్లుగా డెన్మార్క్, ఇంగ్లండ్‌లలో మహిళా లీగ్‌లు ఆడుతోంది. ఈమె క్రికెట్లో ఓనమాలు దిద్దింది భారత్‌లోనే.