
తాజా వార్తలు
ఆన్లైన్ క్లాసులు వద్దని గొడవ!
మా బాబు వయసు పదేళ్లు. తనకు చదువంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను కూడా విననని గొడవ చేస్తున్నాడు. తనకు చదవడం ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు. పదినిమిషాలు కూడా చదువుపై దృష్టి పెట్టడు. తనకేదైనా మానసిక సమస్యా?
- ఓ సోదరి
మీ మాటలను బట్టి బాబుకు డెవలప్మెంటల్ డిజార్డర్ ఉందేమోననిపిస్తోంది. సాధారణంగా ఈ సమస్య ఉన్నవారిలో... మెదడు ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. దాంతో తన చుట్టూ జరుగుతున్న విషయాలని అర్థం చేసుకోవడం, వాటిని నేర్చుకుని ఆచరణలో పెట్టడంలో ఆలస్యం అవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న పిల్లల్లో ఏకాగ్రత కూడా లోపిస్తుంది. దాంతో ఒకచోట కుదురుగా ఉండలేరు. ఓవర్యాక్టివ్గా ఉంటారు. ఒక అంశం నుంచి మరో విషయానికి వెళ్లిపోతుంటారు. మీ బాబు కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత నుంచే ఇలా ఉన్నాడా లేక ముందు నుంచీ ఇంతేనా? ఇందుకోసం కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో పిల్లాడికి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉందా లేక అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందా అనేది తెలుస్తుంది. రెండో సమస్య ఉన్న పిల్లలు నేర్చుకున్నదాన్ని క్రమపద్ధతిలో రాయడం, అప్పగించడం చేయలేరు. ఇక మరికొంతమంది పిల్లల్లో మాములుగా కంటే తెలివితేటలు కాస్త తక్కువగా ఉంటాయి. చదివినదాన్ని వీళ్లు సరిగా అర్థం చేసుకోలేరు. దాంతో చదువంటే ఆసక్తి ఉండదు. ఇక మీ అబ్బాయి విషయానికొస్తే.. నిరంతరం చదవమంటూ మీరు ఒత్తిడి చేసినప్పటికీ చదవనని మొండికేస్తున్నాడు. ఆసక్తి లేని అంశాన్ని చదవమంటూ బలవంతం పెట్టేసరికి తను మరింత ఒత్తిడికి గురవుతున్నాడేమో. తను ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగా తనని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు పరీక్ష చేసి సమస్య ఏమిటో తెలుసుకుంటారు. చికిత్సతోపాటు చదివే పద్ధతులు నేర్పిస్తారు.