close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/07/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికా రష్యా... ఎవరు ఎవరివైపు?

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత్‌

ద్దాఖ్‌లో భారత్‌తో ఘర్షణలకు దిగడం, కొవిడ్‌ వ్యాప్తి గురించిన నిజాలను కప్పిపెట్టడంవంటి కారణాలతో చైనాపై ప్రపంచం అనుమాన దృక్కులు సారిస్తోంది. ఎల్‌ఏసీపై చైనా దూకుడును భారత్‌ గట్టిగా ఎదుర్కొంటున్న సందర్భంలో అమెరికా, రష్యాలతో భారత రక్షణ బంధం ఏ విధంగా అక్కరకొస్తుందో పరిశీలించడం సముచితంగా ఉంటుంది. ఐరోపాలోని అమెరికన్‌ సైనికులను ఆసియాలో చైనా దురాక్రమణ పంథాను అడ్డుకోవడానికి తరలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపెయో ప్రకటించడం ఇక్కడ గమనించాలి. చైనా ఒక్క భారత్‌పైనే కాకుండా, దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేసియా, ఇండొనేసియాలపై కూడా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ దేశాలకు వత్తాసుగా అమెరికన్‌ సైనికులను పంపుతామన్న ధ్వని పాంపెయో ప్రకటనలో ఉంది. ఇప్పటికే అమెరికన్‌ యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి చేరాయి. అమెరికన్‌ విమానాల గస్తీ ముమ్మరమైంది.

సమతుల విధానం

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా విజయాన్ని పురస్కరించుకుని ఏటా మాస్కోలో జరిగే సైనిక సంబరాలకు ఈ ఏడాది భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. అక్కడ రష్యా రక్షణ మంత్రి యూరీ బోరిసోవ్‌తో తాను జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన తెలిపారు. భారత్‌తో కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలను నెరవేర్చడమే కాదు, అవసరమైనప్పుడు శీఘ్రంగా సరఫరాలకూ సిద్ధమేనని రష్యా భరోసా ఇచ్చిందని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. బోరిసోవ్‌తో జరిపిన చర్చల్లో రాజ్‌నాథ్‌ ఏయే ఆయుధాలు కోరారో తెలియదు కానీ, ఎస్‌-400 ట్రయంఫ్‌ దూరశ్రేణి క్షిపణుల సేకరణను వేగవంతం చేసే విషయం మాత్రం కచ్చితంగా చర్చకు వచ్చిఉండాలి. భారత్‌ 540 కోట్ల డాలర్లతో ఎస్‌-400 క్షిపణులను కొనబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సంవత్సరం అమెరికా అమలులోకి తెచ్చిన కాట్సా చట్టం ఎస్‌-400 క్షిపణి కొనుగోలుకు అడ్డు తగులుతుందా- అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాట్సా అనేది అమెరికా ప్రత్యర్థులపై ఆర్థిక ఆంక్షలను ప్రయోగించడానికి అధికారమిచ్చే చట్టం. అమెరికా దీని కింద రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా రక్షణోత్పత్తుల సంస్థలతో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్ఛు రష్యా నుంచి భారత్‌ ఈ క్షిపణులను కొంటే భారత్‌-అమెరికా సైనిక సంబంధాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవచ్చని 2019 జూన్‌లో అప్పటి అమెరికా ఉప మంత్రి ఏలిస్‌ వెల్స్‌, అమెరికా కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల ఉప సంఘానికి చెప్పారు. ఎవరితో రక్షణ భాగస్వామ్యం నెరపాలి, ఎవరి నుంచి ఆయుధాలు సేకరించాలనే అంశంపై స్పష్టత ఉండాలని వెల్స్‌ భారత్‌ను అన్యాపదేశంగా ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

రష్యా నుంచి భారత్‌ ఎస్‌-400 క్షిపణులను కొనడం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. అమెరికాకు నచ్చజెప్పి ఒప్పించడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గతేడాది అక్టోబరులో వాషింగ్టన్‌కు వెళ్లినప్పుడు గట్టి ప్రయత్నం చేశారు. తన ప్రయత్నంలో చెప్పుకోదగిన స్థాయిలో కృతకృత్యుడయ్యాననే అనుకుంటున్నానని చెప్పారు. ఎస్‌-400 భారతదేశ రక్షణకు ఎంతో అవసరమని మిత్రులు గుర్తిస్తారని భావిస్తున్నానని అన్నారు. అందుకు తగ్గట్టే గతేడాది నవంబరులో భారత్‌పై కాట్సా ఆంక్షలు విధించకపోవచ్చని అమెరికా ప్రభుత్వం పరోక్ష సంకేతాలిచ్చింది. అమెరికా నుంచి భారత్‌కు అందే రక్షణ పరిజ్ఞానం రష్యా చేతిలో పడకుండా దిల్లీ జాగ్రత్త వహించాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికా ప్రస్తుతానికి రష్యా నుంచి ఎస్‌-400 కొనుగోలుకు భారత్‌కు పరోక్షంగా సమ్మతి తెలిపినా, మున్ముందు కాట్సా నిబంధనలకు లోబడి రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఆశిస్తోందని భారత్‌-అమెరికా రాజకీయ కార్యాచరణ కమిటీ సంచాలకుడు రవీందర్‌ సచ్‌ దేవ్‌ వివరించారు. ఆనాటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్‌-400 కొనుగోలుపై అమెరికా చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. ఇరాన్‌పై అమెరికా విధించిన కాట్సా ఆంక్షలను మాత్రం భారత్‌ తు.చ. తప్పకుండా పాటించాలని రాజ్‌నాథ్‌ వాషింగ్టన్‌కు వెళ్లినప్పుడు అమెరికన్లు కోరారు. ఇరాన్‌లో భారత్‌ నిర్మిస్తున్న చాబహార్‌ రేవు విషయంలో మాత్రం అమెరికా అభ్యంతరపెట్టకపోవడం విశేషం.


ఎస్‌-400 క్షిపణుల తడాఖా!

మెరికా పేట్రియాట్‌, థాడ్‌ క్షిపణులను ఇవ్వజూపినా భారతదేశం, రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణుల కొనుగోలుకే కట్టుబడింది. ఎస్‌-400 ప్రపంచంలో ఎదురులేని క్షిపణి వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. బహుళవిధ రాడార్‌, శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి ఎదురుదాడి చేసే యంత్రాంగం, విమాన విధ్వంసక క్షిపణులు, నియంత్రణ కేంద్రం ఎస్‌-400 వ్యవస్థలో అంతర్భాగాలు. ఈ వ్యవస్థ మూడు రకాల క్షిపణులను ప్రయోగించగలదు. శత్రు విమానాలను, పైలట్‌ రహిత యూఏవీలను, క్షిపణులను ఎస్‌-400 తుత్తునియలు చేస్తుంది. శత్రు విమానాలు, క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తున, 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి ఎదురుదాడి జరపగలదు. ఇది ఏకకాలంలో 30 శత్రు విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కోగలదు. గతంలో రష్యా రూపొందించిన క్షిపణి వ్యవస్థలకు రెట్టింపు సామర్థ్యంతో ఎస్‌-400 వ్యవస్థ పనిచేస్తుంది. ఈ సంచార వ్యవస్థను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు, అయిదు నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్ఛు సైన్యం, వాయు, నౌకా సేనలు మూడింటికీ గగనతల రక్షణ వ్యవస్థగా ఎస్‌-400 వ్యవస్థలను వినియోగించవచ్ఛు.


లద్దాఖ్‌ ఘర్షణలతో మారిన పరిస్థితి

ఎల్‌ఏసీపై చైనా దురాక్రమణ అమెరికా, రష్యాలతో భారత్‌ రక్షణ సంబంధాల ప్రభావాన్ని చర్చకు తెచ్చింది. రెండు అగ్ర రాజ్యాలకు భారత్‌ వ్యూహాత్మక, కీలక భాగస్వామి. అమెరికా 2016లో భారత్‌ను సాధికారికంగా రక్షణ భాగస్వామిగా గుర్తించింది. జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి భారత్‌, అమెరికాలు క్వాడ్‌ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జపాన్‌, తైవాన్‌ల పట్ల ఇటీవల చైనా చాలా దురుసుగా వ్యవహరిస్తోంది. తూర్పు చైనా సముద్రంలో వివాదగ్రస్త సెంకోకు దీవుల వద్ద 67 చైనా నౌకల సంచారాన్ని కనిపెట్టామని జపాన్‌ తీర రక్షక దళం తెలియజేసింది. ఈ దీవులు తమవంటే తమవని- చైనా, జపాన్‌ తగవుపడుతున్నాయి. మరోవైపు ఒక చైనా యుద్ధ విమానం ఇటీవల తైవాన్‌ గగనతలంలోకి నాలుగుసార్లు చొరబడింది. తైవాన్‌ తనదేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ సముద్ర చట్టాలను చైనా పదేపదే ఉల్లంఘిస్తోందని వియత్నాం, ఫిలిప్పీన్స్‌ మళ్లీ ఆరోపించాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఫిలిప్పీన్స్‌కు ఉన్న హక్కులను చైనా అతిక్రమించిందని 2016లోనే అంతర్జాతీయ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు చెప్పినా, బీజింగ్‌ దాన్ని ఖాతరు చేయడం లేదు. ప్రపంచం ఒకవైపు కరోనా సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే చైనా బాధ్యతారహితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని వియత్నాం ప్రధానమంత్రి నుయెన్‌ జువాన్‌ ఫుక్‌ ఇటీవల ఆసియాన్‌ వర్చువల్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు. చైనా విపరీత పోకడలను ప్రపంచమంతా నిరసిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి ఎల్‌ఏసీ విషయంలో సర్వత్రా మద్దతు లభించే అవకాశాలు పుష్కలం.

- అరుణిం భుయాన్‌

(రచయిత సీనియర్‌ పాత్రికేయులు)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.