close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

180 రోజుల్లో... భూమిలో కలిసిపోతాయి!

ఒక టీ-షర్టు ఒంటి మీదికి రావడానికి దాదాపు వెయ్యి లీటర్లకు పైగా నీళ్లు ఖర్చు అవుతాయని తెలుసా! అదే జీన్స్‌ అయితే ఇంతకు ఐదింతల నీళ్లు వృథా! ఈ నిజాలు గురుగ్రామ్‌కు చెందిన హితేషా దేశ్‌పాండేను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మన అవసరం కోసం, అందం కోసం ధరిస్తున్న దుస్తుల కారణంగా ఇంత నష్టం జరుగుతోందా అని ఆశ్చర్యపోయింది. బాగా ఆలోచించి ఓ అందమైన పరిష్కారాన్ని కనుక్కొంది. 180 రోజుల్లోనే భూమిలో పూర్తిగా కలిసిపోయే దుస్తులను రూపొందించి ఔరా! అనిపించుకుంది.

వస్త్ర ప్రపంచం కంటికి ఇంపుగా కనిపిస్తుంది. కళ్లు చెదిరే రంగులు, మనసు దోచే హంగులు.. వాటి మాయలో పడిపోయి ఒక్క డ్రెస్‌ కొనడానికి వెళ్లి ఐదేసి జతలు కొనేస్తుంటాం. కానీ, ఆ రంగులు, హంగుల వెనుక పర్యావరణానికి హాని తలపెట్టే ఎన్నో కారకాలు ఉన్నాయని ఎవరూ గుర్తించరు. మనకు రక్షణగా ఉండే దుస్తులు.. ప్రకృతి కాంతకు శిక్ష కాకూడదని భావించింది 37 ఏళ్ల హితేషా. ఈ ప్రయత్నంలో భాగంగా బయోడిగ్రేడబుల్‌ అంటే భూమిలో పూర్తిగా కలిసిపోయే దుస్తులను రూపొందించి.. సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

పర్యావరణ హితం కోరి..

గుర్‌గ్రామ్‌కు చెందిన హితేషా క్రిమినల్‌ సైకాలజీలో పీజీ చేసింది. డిజిటల్‌ మార్కెటింగ్‌లో అనుభవం గడించింది. జంతు ప్రేమికురాలు కావడంతో యానిమల్‌ థీమ్‌ కలెక్షన్స్‌ కోసం ప్రయత్నించిందామె. కోరుకున్న డిజైన్లు లభించలేదు. ఇదే సమయంలో హిమాన్షు కల్హరీ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌ తీసుకొస్తే బాగుంటుందని భావించారు. ఆ ప్రయత్నంలో భాగంగా టెక్స్‌టైల్స్‌ రంగంపై లోతుగా పరిశీలించినప్పుడు విస్తుపోయే నిజాలు ఆమెకు తెలిశాయి. దుస్తుల ఉత్పత్తి, వాటికి రంగులు అద్దే క్రమంలో ఎన్ని వ్యర్థాలు వెలువడుతున్నాయో తెలిసింది. రసాయనిక వర్ణాలు, సింథటిక్‌ మెటీరియల్స్‌ కాలుష్య కారకాలు ఎలా అవుతున్నాయో గ్రహించింది. తాము తీసుకొచ్చే బ్రాండ్‌ పూర్తిగా పర్యావరణ హితంగా ఉండాలని అప్పుడే నిశ్చయించుకుంది హితేషా. 2018లో ‘పెక్డ్‌’ పేరుతో ఫ్యాషన్‌ లేబుల్‌ను ప్రారరభించింది. ఇక్కడ ఉత్పత్తి చేసే దుస్తులు.. ఫ్యాషన్‌ ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటూ పర్యావరణానికి రక్షణ కవచాలవ్వాలని కోరుకుంది.

నార నుంచి వస్త్రం..

పెక్డ్‌ ఎకో ఫ్రెండ్లీ దుస్తులకు ఏ రంగులూ ఉండవు. నిర్మలమైన తెలుపుతో హితేషా సంకల్పాన్ని తెలుపుతుంటాయి. వీటి కోసం ఉపయోగించే ఫ్యాబ్రిక్‌లో కొంతభాగం చెట్ల నార నుంచి ఉత్పత్తి చేయడం విశేషం. మరోవైపు సుందర్‌బన్‌ ప్రాంతంలోని నేత కార్మికుల నుంచి కాటన్‌, సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ సమకూర్చుకుంటోంది. ఏ రంగులూ లేని ఆ వస్త్రంతో ఫ్యాషన్‌ సూత్రాలకు అందని అందమైన దుస్తులను రూపొందించింది హితేషా. సింథటిక్‌ వస్తువుల ఉపయోగం లేకుండా పర్యావరణహిత వస్త్రశ్రేణిని మార్కెట్‌కు పరిచయం చేసింది. దుస్తుల డిజైన్లు, వాటి వెనుకున్న ప్రత్యేక కారణం తెలుసుకున్న తర్వాత ప్రకృతి ప్రేమికులు హితేషాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పలు ఫ్యాషన్‌ షోల్లో తమ ఉత్పత్తులను ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకుందామె. ఆన్‌లైన్‌ విపణిలో వీటికి మంచి డిమాండూ ఉంటోంది. అమెరికా, యూకే, నార్వే దేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి.

వాల్‌నట్స్‌ బొత్తాలు..

సహజంగా దుస్తులకు ఉండే బొత్తాలు ప్లాస్టిక్‌, ఫైబర్‌తో చేసినవే ఉంటాయి. కానీ, పెక్డ్‌ దుస్తుల బొత్తాలు వాల్‌నట్స్‌, కూరగాయల్లోని పీచు నుంచి తయారు చేస్తుంటారు. తమ ఉత్పత్తుల్లో దారం పోగు కూడా పర్యావరణానికి హాని చేయదంటోంది హితేషా. ఈ దుస్తుల కాలపరిమితి ముగిసిన తర్వాత.. భూమిలో పాతేస్తే 180 రోజుల్లో కనిపించకుండా పూర్తిగా మట్టిలో కలిసిపోతాయని చెబుతోందామె. ప్లాస్టిక్‌, మెటల్‌ జిప్‌ల స్థానంలో వెదురుతో తయారు చేసే జిప్పర్‌లను వాడే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దుస్తుల ప్యాకింగ్‌లో రకరకాల విత్తనాల నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌ పేపర్‌ను వినియోగిస్తోంది. పర్యావరణహిత వస్త్రశ్రేణికి ప్రాచుర్యం కల్పిస్తూనే మరోవైపు ‘ఫైండింగ్‌ ఎంకి’ అనే బ్రాండ్‌ కమ్యూనికేషన్‌ ఏజెన్సీని నిర్వహిస్తోంది. నిరక్ష్‌ ఫిల్మ్‌ కో ఫౌండర్‌గా సృజనాత్మక రంగంలోనూ సత్తా చాటుతోంది. ‘మన అభివృద్ధి భూమిని మింగేయకూడదనే నా ప్రయత్నమంతా’ అంటోంది హితేషా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.