close

తాజా వార్తలు

Updated : 04/03/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుపతిలో బాలుడి అపహరణ

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన కుటుంబంలో నుంచి బాలుడు అపహరణకు గురయ్యాడు. మూడు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవీ వివరాలు... ఛత్తీస్‌గఢ్‌లోని కురూస్‌ గ్రామం నుంచి ఫిబ్రవరి 23న ప్రైవేటు బస్సులో 55 మంది ఆలయాల సందర్శన నిమిత్తం బయలుదేరి వచ్చారు. వారిలో ఉత్తమ్‌ కుమార్‌ సాహు కుటుంబానికి చెందిన నలుగురిలో... శివమ్‌ కుమార్‌ సాహు(6) ఉన్నాడు. 27న తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు చేరుకుని శ్రీవారి దర్శనార్థం టోకన్లు తీసుకున్నారు. అదేరోజు స్థానిక ఆలయాలు సందర్శించి... మరుసటి రోజు ఉదయం తిరుమలకు వెళ్లేందుకు తిరిగి బాలాజీ లింకు బస్టాండు వద్దకే వచ్చారు. భోజనాలు చేసి పడుకునే సమయంలో శివమ్‌ కుమార్‌ సాహు కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదు చేశారు.

భక్తుడిలా పక్కనే పడుకుని...

తెల్లచొక్కా, గళ్ల లుంగీతో గుర్తు తెలియని వ్యక్తి(40) ఫిబ్రవరి 27న సాయంత్రం 6.30 గంటలకు గులాబీ రంగు సంచీతో బాలాజీ లింకు బస్టాండులోకి ప్రవేశించాడు. ఉత్తమ్‌ కుమార్‌ కుటుంబసభ్యులకు దగ్గరగా చేరాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న శివమ్‌ కుమార్‌ సాహుతో మాట్లాడుతూ ఉత్సాహంగా గడిపాడు. రాత్రి 9.30 గంటలప్పుడు అతను బస్టాండు నుంచి నడిచి వెళ్తుండగా... వెనుకే బాలుడు అనుసరించాడు. ఇస్కాన్‌ ఆలయం దాటిన తర్వాత అతను బాలుడి చేయి పట్టుకుని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో కన్పించాయి. అన్నారావు సర్కిల్‌ మీదుగా తితిదే పరిపాలన విభాగం వరకు వచ్చారు. అక్కడ నుంచి కన్పించలేదు. తర్వాత నగరంలోని మరో ప్రాంతంలో ఆ వ్యక్తి ఒంటరిగా తిరిగినట్లు గుర్తించారు. బుధవారం పది బృందాలతో జల్లెడ పడుతున్నారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వయంగా రంగంలోకి దిగి గాలిస్తున్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని