close

తాజా వార్తలు

Updated : 12/08/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూటమిగానే డ్రాగన్‌కు కళ్లెం!

ప్రపంచ వేదికపై మారుతున్న సమీకరణలు

ప్రపంచవ్యాప్తంగా ప్రచ్ఛన్నయుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. టీకా పరిశోధనకు సంబంధించిన కీలకాంశాలను తస్కరిస్తోందన్న ఆరోపణలపై హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ ఆఫీస్‌ను అమెరికా మూసేయించింది. అందుకు ప్రతిగా చైనాలోని చెంగ్డూలో అమెరికా దౌత్యకార్యాలయ అనుమతుల ఉపసంహరణ శరవేగంగా జరిగిపోయింది. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రం వేదికగా ఇరు దేశాలు బలప్రదర్శనకు దిగాయి. అమెరికా ఎన్నికలకు మూడు నెలల ముందు చోటు చేసుకొన్న ఈ పరిణామాలు చైనాతో సంబంధాలు పతనమవుతున్న విషయాన్నే వెల్లడిస్తున్నాయి. మరో ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి.

ప్రచ్ఛన్నయుద్ధ సంకేతాలు

చైనాను ఆయుధపోటీలోకి దింపేందుకు అమెరికా కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. దీనిలో భాగంగానే రష్యాతో ఉన్న ఒప్పందాలను అది రద్దు చేసుకొంటోంది. ఐఎన్‌ఎఫ్‌, ఓపెన్‌ స్కై ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసింది. అణు వార్‌హెడ్‌లను పరిమితం చేసే ‘న్యూ స్టార్ట్‌’ ఒప్పందానికీ వచ్చే ఏడాది ప్రారంభంలో కాలం చెల్లుతుంది. దీన్ని కొనసాగించేందుకు అమెరికా ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. అంటే అమెరికా అణ్వాయుధ రేసును మళ్ళీ మొదలుపెట్టనుందనే దీనర్థం! మరోవంక ఈ ఏప్రిల్‌లో తక్కువ సామర్థ్యంగల అణ్వస్త్రాన్ని చైనా పరీక్షించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అదేం లేదని ‘డ్రాగన్‌’ ఖండించినా అమెరికా అనుమానాలు మాత్రం తీరలేదు. తక్కువశ్రేణి అణ్వాయుధాలను పరీక్షించడమంటే ఆధునిక అణుపోటీకి సై అనడమే. ఎందుకంటే భవిష్యత్తులో ‘జార్‌బంబా’ వంటి భారీ అణ్వస్త్రాలను ప్రయోగించే అవకాశమే లేదు. అందుకే స్వల్పశ్రేణి అణువార్‌హెడ్‌ల అభివృద్ధిపై అగ్రదేశాలు దృష్టిపెట్టాయి.

కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. వైమానిక రంగానికి చెందిన సాంకేతిక విజ్ఞానాన్ని దొంగిలించడం, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నించడం వంటి అంశాలకు ఆ ఘర్షణ పరిమితమైంది. ఆ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది. 5-జీ విషయంలో హువావేపై అమెరికా గురిపెట్టడంతో వ్యాపార సమరం ముదురుపాకాన పడింది. నల్లజాతీయుల (బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్‌) ఉద్యమానికి చైనా రాయబార కార్యాలయం నుంచి లోపాయికారీగా సహకారం అందిందని ట్రంప్‌ అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని అమెరికా ఎన్నికల్లో బలమైన అస్త్రంగా మార్చేందుకు ట్రంప్‌ కార్యవర్గం పదునుపెడుతోంది. దక్షిణ చైనా సముద్రంసహా మొత్తం ఆసియాలో తన ప్రాబల్యాన్ని విస్తరించాలన్న వ్యూహంతో ‘డ్రాగన్‌’ పావులు కదుపుతోంది. జపాన్‌, వియత్నాం, తైవాన్‌, ఇండొనేసియా, భారత్‌ల విషయంలో అది మరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జపాన్‌, ఫిలిప్పీన్స్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం ఉంది. తాజాగా వియత్నాం సైతం తమ మత్స్యకారుల రక్షణకు అమెరికాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. వియత్నాం రక్షణకు అమెరికా పూచీకత్తుగా మారే ఒప్పందమూ మున్ముందు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలుతో బ్రిటన్‌, జర్మనీతో కూడా చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. హాంకాంగ్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాల్ని ఈ రెండు దేశాలు రద్దు చేసుకొన్నాయి. ఇవన్నీ చైనాకు కళ్లెం వేసేందుకు ఉద్దేశించినవే.

భారత్‌ తేల్చుకోవాలి!

తొలి ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో భారత్‌ కొంతమేర సోవియట్‌ వైపు మొగ్గినా, దాదాపు తటస్థంగానే ఉందని చెప్పవచ్ఛు అప్పట్లో ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాత్మక వేదిక ఐరోపా, అమెరికా ఖండాల్లో కేంద్రీకృతమై ఉండేది. అందుకే తటస్థంగా ఉన్నా భారత్‌కు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇప్పుడు అమెరికా-చైనా మధ్య ఆధిపత్య పోరుకు భారత్‌ వేదికగా నిలుస్తోంది. నేపాల్‌, పాక్‌లను భారత్‌ చుట్టూ చైనా ఇప్పటికే మోహరించింది. శ్రీలంక, ఇరాన్‌ వంటివీ ఆ జాబితాలో చేరే అవకాశాలు కొట్టిపారేయలేనివి. భారత్‌ భూభాగాలను తమవిగా చెప్పుకొంటూ కిందటి నెల నేపాల్‌, తాజాగా పాకిస్థాన్‌ రాజకీయ పటాలు విడుదల చేశాయి. అంతేకాదు- గుజరాత్‌లోని జూనాగఢ్‌ను సైతం పాక్‌ తమ భూభాగంగా ప్రకటించడం గమనార్హం. నేపాల్‌, పాక్‌ వ్యవహరిస్తున్న తీరు ఒకేలా ఉండటం గమనార్హం.

గల్వాన్‌ ఘటన నేపథ్యంలో- ‘ఓ మంచి పొరుగు దేశంగా ఉండాలనే భ్రమ’ నుంచి భారత్‌ త్వరగా బయటకు రావాలి. చైనాకు కోపం వస్తే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు భవిష్యత్తులో శాశ్వత సభ్యత్వం దక్కనీయకుండా అడ్డుపడుతుందనే భయాలు ఉన్నాయి. వాస్తవానికి చైనా ఎట్టి పరిస్థితుల్లో భారత్‌కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం దక్కనీయదు. అటువంటప్పుడు చైనా ఏమనుకుంటుందో అనే భయాలు అనవసరం. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు వద్ద వెనక్కి వెళ్లకుండానే సైనికుల ఉపసంహరణ పూర్తయిందని చైనా రాయబారి చెప్పడం ప్రమాదకర సంకేతాలను పంపిస్తోంది. తాజాగా ఐరాస భద్రతా మండలిలో మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు ‘డ్రాగన్‌’ యత్నించింది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో చైనాకు వ్యతిరేకంగా భారత్‌ పక్షాన రష్యా నిలుస్తుందని చెప్పలేం. ఇరాన్‌ను నొప్పించకూడదని అమెరికాను సైతం భారత్‌ కొంత దూరం పెట్టింది. కానీ, ఇప్పుడు ఇరానే ‘డ్రాగన్‌’ పక్షాన చేరింది. దీంతో భారత్‌కు మధ్య ఆసియాకు వెళ్లే వాణిజ్యమార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇప్పుడు భారత్‌కు మిగిలిన ఏకైక అవకాశం అమెరికానే. ఈ సమయంలో అగ్రరాజ్యం మద్దతు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా భారత్‌కు అక్కరకొస్తుంది.

అమెరికా అండ అవసరం

చైనా వైఖరితో అమెరికా, రష్యా, బ్రిటన్‌ వంటి అగ్రదేశాలు విసిగిపోయాయి. ఈ క్రమంలో భారత్‌కు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానపరంగా, వాణిజ్యపరంగా లబ్ధిచేకూర్చే అంశం. గల్వాన్‌లో చైనాతో ఘర్షణ సమయంలో ఆస్ట్రేలియా దూకుడుగా భారత్‌కు మద్దతు తెలిపింది. అమెరికాకు సైతం అఫ్ఘానిస్థాన్‌లో అవసరాలు దాదాపు తీరిపోయాయి. దాంతో అది పాక్‌ను చేరదీసే అవకాశాలూ లేవు. మరోవైపు రష్యా కూడా చైనా దూకుడును కొంత కట్టడి చేయాలని భావిస్తోంది. తమ శాస్త్రవేత్త వేల్రీ మిట్రోనుంచి దేశ సైనిక రహస్యాలను చైనా తస్కరిస్తోందని గుర్తించి ఎస్‌-400 సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు, చైనా పత్రికలు మెల్లగా రష్యాలోని వ్లాదివాస్తోక్‌ ప్రాంతం గతంలో తమదే అని సణగడం మొదలుపెట్టాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రష్యా విషయంలో మరీ వ్యతిరేకంగా లేరు. జి-7ను విస్తరించే క్రమంలో భారత్‌తోపాటు రష్యాను కూడా భాగస్వామి చేసుకోవాలని భావిస్తున్నారు. రష్యా సైతం చైనా సైనిక విస్తరణ తన పరపతికి ముప్పుగానే భావిస్తోంది. భారత్‌, అమెరికా, రష్యాలను ప్రధాన ముప్పుగా భావిస్తోంది చైనానే. డ్రాగన్‌ కట్టడి విషయంలో భావసారూప్యత ఉన్న ముగ్గురూ ఏకతాటిపైకి రావాల్సి ఉంది. ఈ క్రమంలో రష్యా తటస్థ వైఖరి కూడా భారత్‌కు మేలు చేస్తుంది. భారత్‌ వ్యూహకర్తల నోటి నుంచి తరచూ వినిపించే పదం ద్విముఖ యుద్ధం (టూ ఫ్రంట్‌ వార్‌)- అంటే ఆర్థికంగా, ఆయుధపరంగా బలంగా ఉన్న చైనా- పాకిస్థాన్‌తో జట్టుకట్టి దాడికి తెగబడవచ్చునని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మన విధానకర్తలు తరచూ చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ దాడిని భారత్‌ ఒక్కటే ఎదుర్కోవాలనుకోవడం మొండితనమే అవుతుంది. అందుకే భారత్‌ సైతం ఓ బలమైన మిత్రుడితో జట్టు కట్టాలి. ఆ దోస్తీ భారత్‌ను వాణిజ్యపరంగా, సాంకేతికంగా చైనాకు దీటుగా మార్చేందుకు ఉపకరించాలి. ఎందుకంటే ఆధునిక కాలంలో యుద్ధమంటే ఆయుధాలతో మాత్రమే చేసేదికాదు- ఆర్థికంగానూ ఢీ అంటే ఢీ అనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి!

- పెద్దింటి ఫణికిరణ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.