దేశ చరిత్రను మలుపుతిప్పిన ఏడాది
close

తాజా వార్తలు

Published : 30/05/2020 07:26 IST

దేశ చరిత్రను మలుపుతిప్పిన ఏడాది

ఈనాడు, దిల్లీ

అందరితో కలిసి.. అందరి వికాసానికి (సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌) అంటూ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ సర్కారు శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్రవేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ..   చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నామని చెబుతూ.. పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే సాహసోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది. చివరి నెలల్లో కరోనా విరుచుకుపడినప్పటికీ..   మహమ్మారి బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది.    నవ భారత నిర్మాణమే లక్ష్యమంటూ మోదీ ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనను అవలోకనం చేసుకుందాం..


ముస్లిం మహిళలకు అండ

ముస్లిం మహిళల గౌరవ, ప్రతిష్ఠలను కాపాడటం.. వారి వివాహ హక్కులకు రక్షణ కల్పించడం అనే లక్ష్యాలతో తీసుకొచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును 2019 జులై 30న పార్లమెంటు ఆమోదించడం చరిత్రాత్మక నిర్ణయం. తొలినుంచీ ముస్లిం మహిళల వివాహ హక్కుల కోసం బలంగా వాదిస్తూ వచ్చిన మోదీ రెండోసారి గెలుపొందిన తర్వాత.. పార్లమెంటు మొదటి సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపజేశారు. ఆగస్టు 1న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టరూపం దాల్చింది. దీని ప్రకారం - ముస్లిం వివాహిత వ్యక్తి మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యను వదిలించుకోవాలని చూస్తే అది నేరం. మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ఈ బిల్లు ఆమోదించినపుడు కొన్నిపార్టీలు, వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా.. మొత్తంమీద ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్న భావన వ్యక్తమైంది.


‘అయోధ్య’ రాముడిదే

స్వతంత్ర భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన రామ జన్మభూమి అంశానికి మోదీ రెండోదఫా పాలనలోని తొలి ఏడాదిలోనే న్యాయప్రక్రియ ద్వారా పరిష్కారం లభించింది. ఈ కేసులో వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను రామ జన్మభూమి ట్రస్ట్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టు 2019 నవంబరు 9న తుదితీర్పు ఇచ్చింది. నిజానికి పరిష్కారం చూపింది సుప్రీంకోర్టే అయినప్పటికీ.. పరిస్థితిని చక్కబెట్టడంలో, భద్రత ఏర్పాట్లు చేపట్టడంలో మోదీ సర్కారు చాకచక్యంగా వ్యవహరించింది. మూడు నెలల్లోపు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దానికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్థలాన్ని స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈఏడాది ఫిబ్రవరి 5న లోక్‌సభ వేదికగా ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర’ ట్రస్ట్‌ను ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి సేకరించిన 62.23 ఎకరాల భూమిని దానికి స్వాధీనం చేశారు. మొన్నటి శ్రీరామనవమి నుంచి పనులు ప్రారంభం అవుతాయని అంతా భావించినా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్య అత్యంత కీలకాంశం. దీనికి న్యాయస్థానం ద్వారా పరిష్కారం లభించడంతో మొత్తం కార్యక్రమం అత్యంత శాంతియుతంగా జరిగిపోయింది.


‘370’ రద్దు.. చరిత్రాత్మకం

చరిత్రలో నిలిచిపోయే కొన్ని తేదీల్లో ‘2019 ఆగస్టు 5’ కూడా ఒకటి. ఏళ్ల తరబడి రాచపుండులా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారానికి నాంది పలికిన రోజది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయమే జమ్మూ-కశ్మీర్‌ విభజన. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కింద జమ్మూ-కశ్మీర్‌ అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ సర్కారు రద్దుచేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ బిల్లులను మూడో కంటికి తెలియకుండా హోంమంత్రి అమిత్‌షా ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చాకచక్యంగా వ్యూహం అమలు చేశారు. మరుసటి రోజే లోక్‌సభ ఆమోదం పొందారు. దీంతో జమ్మూ-కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకహోదా పోయి దేశంలోని మిగతా రాష్ట్రాలతో సమానంగా నిలిచింది. జమ్మూ-కశ్మీర్‌ భారత యూనియన్‌లో సంపూర్ణంగా విలీనమైంది. భారత చట్టాలన్నింటినీ అక్కడా అమలు చేయడానికి మార్గం ఏర్పడింది. ఆర్టికల్‌ 35-ఎ రద్దు చేయడంతో అక్కడికెళ్లి దేశంలోని మిగతా ప్రాంతాలవారు ఆస్తులు కొని స్థిరపడటానికి, పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమమైంది.


నీటి వివాదాలకు ఒకే ట్రైబ్యునల్‌

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై మన దేశంలో 1962 నుంచి ఇప్పటివరకు 9 ట్రైబ్యునళ్లు వేశారు. వాటిలో 4 మాత్రమే లక్ష్యాన్ని సాధించాయి. రావి-బియాస్‌ నదీ జలాలపై వేసిన ట్రైబ్యునల్‌ ఏకంగా 32 ఏళ్లు కొనసాగింది. ఇలాంటి జాప్యాన్ని నివారించడానికే సంబంధిత చట్టాన్ని మోదీ సవరించారు. ఇకపై దేశమంతటా ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేస్తారు.ఈ సంస్థకు ఒక వివాదాన్ని పరిష్కరించడానికి గరిష్ఠంగా మూడేళ్ల గడువిచ్చారు.


పౌరసత్వం వివాదం

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదస్పదంగా మారింది పౌరసత్వ సవరణ చట్టం. భారత్‌ సరిహద్దులను ఆనుకొని ఉన్న పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో మతపీడనకు గురై.. 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌లో ఆశ్రయం కోరుతూ వచ్చిన హిందూ, క్రిస్టియన్‌, బౌద్ధ, జైన్‌, సిక్కు, పార్సీలకు భారతీయ పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును 2019 డిసెంబర్‌ 9న లోక్‌సభలో, 11న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం పొందడంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చాకచక్యంగా వ్యవహరించారు. ఈ బిల్లు మతవివక్షకు దారి తీస్తోందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. అధికారపక్షం ఉభయసభలో ఆ బిల్లులను గట్టెక్కించుకొంది. రాజ్యాంగం ప్రకారం హేతుబద్ధమైన కారణాలతో పౌరసత్వం ఇవ్వొచ్చన్న వాదనను ప్రభుత్వం గట్టిగా వినిపించింది. ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు అంటూ పలు రాజకీయ పార్టీలతోపాటు దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళన బాట పట్టారు. కరోనా కారణంగా ప్రస్తుతం అవన్నీ పక్కకుపోయాయి. దిల్లీ షహీన్‌భాగ్‌లో జరుగుతున్న నిరంతర ఆందోళనలనూ విరమించాల్సి వచ్చింది.


వ్యక్తులకూ ‘ఉగ్ర’ముద్ర

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) సవరణ బిల్లుకు 2019 ఆగస్టు 2న పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. అప్పటివరకూ కేవలం సంస్థలపై మాత్రమే ఉగ్రవాద ముద్ర వేసేందుకు వీలుండేది. ఈ సవరణతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా గుర్తించి అలాంటి వారిని విదేశాల నుంచి సైతం రప్పించే అధికారాలను భారతీయ వ్యవస్థకు అప్పగించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని